వారిని అరెస్ట్ చేశారు సరే.. మరి వారి భార్యల సంగతేంటి?: అసోం ప్రభుత్వంపై విరుచుకుపడిన ఒవైసీ

  • బాల్య వివాహాలపై అసోం ప్రభుత్వం ఉక్కుపాదం
  • ఇప్పటి వరకు 2 వేల మందికిపైగా అరెస్ట్
  •  రాష్ట్రంలోని ముస్లింలపై బీజేపీ కక్షగట్టిందని ఆరోపణ
Asaduddin Owaisi Slams Assam CM Himanta Biswa Sarma

బాల్య వివాహాలపై అసోం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బాల్య వివాహాలు చేసుకున్న దాదాపు 2 వేల మందిని అరెస్ట్ చేసింది. 4,004 కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు 8 వేల మందిని గుర్తించామని, డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. అసోం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. 

అసోం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాల్య వివాహాలు చేసుకున్న వారిని అరెస్ట్ చేస్తే వారి భార్యలను ఎవరు చూసుకుంటారని ప్రశ్నించారు. ఎగువ అసోంలోని ప్రజలకు భూములు ఇస్తున్న హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం, దిగువ అసోంలోని ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్లు ప్రారంభించారని, కొత్త స్కూళ్లను ఎందుకు ప్రారంభించడం లేదని సీఎంను ఒవైసీ ప్రశ్నించారు. రాష్ట్రంలోని ముస్లింలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కాగా, బాల్య వివాహాలు చేసుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడంపై రాష్ట్రంలోని మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ కుమారులను, భర్తలను అరెస్ట్ చేస్తున్నందుకు నిరసనగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సంపాదించేవారు జైళ్లలో ఉంటే తామెలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. 

More Telugu News