KCR: నాందేడ్‌లో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. పార్టీలో చేరనున్న ‘మహా’ నేతలు!

  • సభ కోసం సర్వం సిద్ధం
  • ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి కూడా జన సమీకరణ
  • ప్రగతి భవన్‌లో పలు రాష్ట్రాల నేతలతో భేటీ
  • ప్రత్యేక విమానంలో వెళ్లనున్న కేసీఆర్
BRS Public Meeting In Nanded Today

ఢిల్లీ పీఠమే లక్ష్యంగా బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ నేడు మహారాష్ట్రలోని నాందేండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక్కడి గురుగోవింద్ సింగ్ మైదానంలో నేటి మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సభ కోసం సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న ఈ సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నాందేడ్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా జనాన్ని తరలించనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. 

నేటి సభ నేపథ్యంలో మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుశాల్ భోప్చే, గడ్చిరోలి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పసులు సమయ్యపోచమ, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ తదితరులు నిన్న ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అలాగే, చత్తీస్‌గఢ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు గోపాల్‌ రిషికార్‌ భారతి, మాజీ మంత్రి డాక్టర్‌ చబ్బీలాల్‌ రాత్రే, మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ మాజీ ఎంపీ బోధ్‌సింగ్‌భగత్‌ తదితరులు కూడా బీఆర్ఎస్ అధినేతతో భేటీ అయ్యారు. కాగా, నేటి మధ్యాహ్నం కేసీఆర్ ప్రత్యేక విమానంలో నాందేడ్ బహిరంగ సభకు వెళ్తారు. తొలుత గురుద్వారను సందర్శిస్తారు. విలేకరుల సమావేశం అనంతరం బహిరంగ సభకు హాజరవుతారు.

More Telugu News