గల్లా అరుణ స్వగ్రామం దిగువమాఘంలో నారా లోకేశ్ కు ఘన స్వాగతం.. ఈనాటి హైలైట్స్

  • నేడు లోకేశ్ పాదయాత్రకు 9వ రోజు
  • ఉత్సాహంగా కొనసాగుతున్న యువగళం పాదయాత్ర
  • బీసీలు, దళితులు, మహిళలతో లోకేశ్ ముఖాముఖీ సమావేశాలు
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకోవాలని పిలుపు
Lokesh gets grand welcome in Galla Aruna Kumari village

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 9వరోజు పూతలపట్టు నియోజకవర్గంలోని వజ్రాలపల్లి క్యాంప్ సైట్ నుంచి శనివారం ప్రారంభమైంది. లోకేశ్ దారిపొడవునా స్థానికులు చెబుతున్న సమస్యలను ఓపిగ్గా వింటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా, పాదయాత్ర ప్రారంభానికి ముందు బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక కుర్చీలు కూడా లేకుండా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని బీసీలు వాపోయారు. 

వంకమిట్టలో మామిడి రైతులు లోకేశ్ ను కలిసి తమ ఇబ్బందులను తెలియజేశారు. కోర్టులో పత్రాలు కొట్టేసిన దొంగ వ్యవసాయమంత్రి అయితే రైతులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. పాదయాత్ర రహదారిలో పలువురు లోకేశ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొండ్రాజుకాల్వలో భోజన విరామం అనంతరం మహిళలతో భేటీ అయిన లోకేశ్ తిరిగి పాదయాత్రను కొనసాగించారు. 

ఇక, మాజీమంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామమైన దిగువమాఘంలో ప్రజలు, కార్యకర్తలు లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలు, మంగళహారతులతో మహిళలు నీరాజనాలు పలికారు. అరుణకుమారి తండ్రి రాజగోపాల్ నాయుడు విగ్రహానికి లోకేశ్ పూలమాల వేసి నివాళులర్పించారు.


పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి క్యాంప్ సైట్ లో లోకేశ్ బీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు అంటే అభివృద్ధికి బ్రాండ్... జగన్ అంటే జైలుకు బ్రాండ్ అని అభివర్ణించారు. అయితే చంద్రబాబును ముసలోడు అంటూ జగన్ రెడ్డి అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో పోటీపడి తిరుమల కొండ ఎక్కే దమ్ముందా? ఎవరు యువకుడో, ఎవరు ముసలోడో తేలిపోతుందని సవాల్ విసిరారు. పరదాలు కట్టుకొని వెళ్ళే నీకు, నిత్యం ప్రజల్లో ధైర్యంగా తిరిగే చంద్రబాబుకు పోలికేమిటంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నేను తిరుగుతా... ఒక్కో కేసు ఎందుకు? ఒకేసారి 175 కేసులు పెట్టుకో జగన్ రెడ్డీ అంటూ లోకేశ్ విరుచుకుపడ్డారు.

"1000 ముఖ్య పదవులు జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని లోన్స్ ఇచ్చారో జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చెయ్యాలి. బీసీలకు ఎవరేం చేశారనే దానిపై మంత్రి వేణు నాకు ఛాలెంజ్ విసిరారు. బహిరంగ చర్చకు నేను సిద్ధం. పాదయాత్ర జరిగే చోటకు వస్తే బీసీల మధ్యలోనే టీడీపీ బీసీలకు ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు నేను సిద్ధం" అంటూ లోకేశ్ ప్రతిసవాల్ విసిరారు. 

మామిడి రైతులతో భేటీ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎంగా చేసుకుని రైతు రాజ్యం తెచ్చుకోవాలనిపిలుపునిచ్చారు. అన్నదాతను ఆదుకోకుంటే రానున్న రోజుల్లో తినడానికి తిండిగింజలు కూడా దొరకవని జగన్ తెలుసుకోవాలి. జగన్ కూడా అన్నమే కదా తినాల్సింది? రూ.2 వేల నోట్లు... బూమ్ బూమ్ బీర్లు తాగి బతకలేరు కదా? అని లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. 


జగన్ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా దళితులపై దాడులు పెరిగాయని  పేర్కొన్నారు. సదకుప్పంలో దళితులతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, హత్యలు చేయడానికి వైసీపీ సైకోలకు లైసెన్సు ఇచ్చేశాడని మండిడ్డారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళాద్రోహి అని విమర్శించారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ తుంగలో తొక్కి మోసగించాడని మండిపడ్డారు.   మహిళలకు జగన్ ప్రభుత్వంలో భద్రత లేకుండాపోయిందని, 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని అన్నారు. 52,587మంది మహిళలపై దాడులు జరిగాయని, మహిళలపై దాడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయని వివరించారు. 

"మహిళలు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుతుంటే బంగారుపాళ్యంలో నాపై పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసుతో నాపై ఇప్పటికి 16కేసులు జగన్ ప్రభుత్వం పెట్టింది. వైఎస్.రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే చంద్రబాబు పూర్తిగా సహకరించి భద్రత కల్పించారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం నా పాదయాత్రకు 29 షరతులు పెట్టి ఇరుకున పెట్టాలని చూస్తోంది" అని వెల్లడించారు. 
* లోకేశ్ పాదయాత్ర వివరాలు* *

ఇప్పటివరకు నడిచిన దూరం: 117.4 కిలోమీటర్లు* *
9వ రోజు (4-2-2023) నడిచిన దూరం: 16.3 కిలోమీటర్లు* 

యువ‌గ‌ళం పాద‌యాత్ర 10వ రోజు (5-02-2023) ఆదివారం షెడ్యూల్‌ వివరాలు

పూతలపట్టు నియోజకవర్గం

ఉదయం 9.00 తవణంపల్లి క్యాంప్ సైట్ లో గాండ్ల సామాజికవర్గీయులతో ముఖాముఖి. అనంతరం పాదయాత్ర ప్రారంభం. 
10.05 మారేడుపల్లిలో బిసి పల్లెరెడ్డి సామాజికవర్గీయులతో సమావేశం. 
10.30 కురపల్లెలో బిసిలతో ముఖాముఖి. 
11.30 కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో పూజలు. 
12.40 కాణిపాకం ఆర్చ్ సెంటర్ లో స్థానికులతో మాటామంతీ. 
1.25 కాణిపాకం యుఎస్ఎం కళ్యాణమండపంలో ముస్లిం మైనారిటీలతో సమావేశం. 
2.00 సీడీఎం కళ్యాణమండపం ఎదుట ప్రాంగణంలో భోజన విరామం సాయంత్రం 
4.20 కాణిపాకం సీడీఎం కళ్యాణ మండపంలో యువతీయువకులతో సమావేశం. 
5.20 పైపల్లె క్రాస్ వద్ద బిసి సామాజికవర్గీయులతో సమావేశం. 
5.45 పైపల్లె అండర్ పాస్ వద్ద సర్వీస్ రోడ్డులో స్థానికనేతలతో మాటామంతీ. 
6.35 సింధు దాబా వద్ద స్థానిక నేతలతో మాటామంతీ. 
7.40 తెల్లగుండ్ల గ్రామంలో స్థానిక నేతలతో మాటామంతీ. 
9.10 మంగసముద్రం విడిది కేంద్రంలో బస. ***

More Telugu News