ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్లు మాకు వీధికొకడు ఉన్నాడు: సొహైల్ ఖాన్

  • వేగంగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్న ఉమ్రాన్ మాలిక్
  • ఇటీవల శ్రీలంకపై 150 కిమీ వేగంతో బంతిని సంధించిన వైనం
  • పాక్ దేశవాళీ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లకు కొదవలేదన్న సొహైల్ ఖాన్
Former pacer Sohail Khan says Pakistan have many bowlers like Umran Malik

భారత్ క్రికెట్ లో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఉమ్రాన్ మాలిక్ పేరు కూడా ఉంటుంది. కశ్మీర్ కు చెందిన ఈ యువకెరటం తన సూపర్ ఫాస్ట్ బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గంటకు 150 కిమీ వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉన్న ఉమ్రాన్ మాలిక్ టీమిండియాకు మరెన్నో సంవత్సరాల పాటు సేవలు అందిస్తాడని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

అయితే, పాకిస్థాన్ మాజీ పేసర్ సొహైల్ ఖాన్ అభిప్రాయాలు మరోలా ఉన్నాయి. ఉమ్రాన్ మాలిక్ వంటి వాళ్లు తమ దేశంలో బోలెడు మంది కనిపిస్తారని అన్నాడు. గంటకు 150 కిమీ వేగంతో బౌలింగ్ చేసేవాళ్లకు పాక్ లో కొదవలేదని, అలాంటి బౌలర్లు వీధికొకడు ఉంటాడని వ్యాఖ్యానించాడు. అలాగని ఉమ్రాన్ మాలిక్ ను తక్కువ చేసి చూపడంలేదని, పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్లో అతడిలా గంటకు 150 కిమీ వేగంతో బౌలింగ్ చేసేవాళ్లు అనేకమంది ఉన్నారన్న ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని వివరణ ఇచ్చాడు. 

ఉమ్రాన్ మాలిక్ ఆడిన ఒకట్రెండు మ్యాచ్ లు చూశానని, మంచి రనప్ తో బౌలింగ్ చేస్తున్నాడని కితాబిచ్చాడు. తమ జాతీయజట్టులో ఉన్న హరీస్ రవూఫ్, నసీమ్ షా, షహీన్ అఫ్రిది ఈ కోవలోకే వస్తారని సొహైల్ ఖాన్ వివరించాడు. 

ఇక, పాకిస్థాన్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ గురించి చెబుతూ... అక్తర్ నెలకొల్పిన వేగవంతమైన బంతి (161.3 కిమీ) రికార్డును మానవమాత్రులు అధిగమించడం అసాధ్యమని అభిప్రాయపడ్డాడు. వేగంగా బౌలింగ్ చేసేందుకు అక్తర్ తీవ్రంగా శ్రమించేవాడని వివరించాడు. జాతీయ జట్టుకు ఆడే రోజుల్లో అక్తర్ రోజుకు 32 రౌండ్లు రన్నింగ్ చేసేవాడని, తాను వారంలో 20 రౌండ్లు కూడా పరిగెత్తేవాడ్ని కాదని సొహైల్ ఖాన్ అంగీకరించాడు. అక్తర్ వంటి అంకితభావం ఉన్న క్రికెటర్ ను మరొకరిని చూడబోమని వ్యాఖ్యానించాడు. 

ఉమ్రాన్ మాలిక్ ఇటీవల శ్రీలంకతో జరిగిన పోరులో గంటకు 150 కిమీ వేగంతో బంతిని విసిరాడు. అంతకుముందు ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడుతూ ఢిల్లీ డేర్ డెవిల్స్ పై అతడు విసిరిన బంతి 156.9 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. భవిష్యత్తులో అక్తర్ రికార్డును బద్దలు కొట్టే సత్తా ఉన్న బౌలర్ గా ఉమ్రాన్ మాలిక్ ను పరిగణిస్తున్నారు.

More Telugu News