chatgpt: సంచలనాల ‘చాట్ జీపీటీ’.. 2 నెలల్లో 100 మిలియన్ యూజర్లు!

  • ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ లకు సాధ్యం కాని ప్రపంచ రికార్డ్ సృష్టించిన చాట్ జీపీటీ
  • యూనిక్ ఫీచర్లతో రోజురోజుకూ పెరిగిపోతున్న యూజర్లు
  • అమెరికాలో చాట్ జీపీటీ ప్లస్ కూడా అందుబాటులోకి
chatgpt becomes fastest growing app in the world records 100mn users in 2 months

‘చాట్ జీపీటీ’ సంచలనాలు సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన ‘ఓపెన్ఏఐ’ సంస్థ రూపొందించిన ఈ యాప్ దూసుకుపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో పని చేసే చాట్ జీపీటీకి లక్షల మంది యూజర్లు ఆకర్షితులవుతున్నారు. ఎంతగా అంటే.. ప్రారంభించిన 2 నెలల్లోనే 100 మిలియన్ల (10 కోట్లు) మంది యూజర్లను చేరుకునేంత!!

100 మిలియన్ యూజర్లతో చాట్ జీపీటీ యాప్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ‘సిమిలర్‌వెబ్’ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో రోజుకు 13 మిలియన్ల మంది యూజర్లను ఈ యాప్ సంపాదించుకుంది. ఇలా ఇన్‌స్టాగ్రామ్ (2.5 ఏళ్లు పట్టింది), టిక్ టాక్ (9 నెలలు పట్టింది) సహా మహా మహా సంస్థలకు సాధ్యం కాని రీతిలో చాట్ జీపీటీ కేవలం 2 నెలల్లోనే 100 మిలియన్ల ఘనతను అందుకుంది. ఇందులో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు వాటాలు ఉన్నాయి.

సిమిలర్ వెబ్ అంచనాల ప్రకారం.. chat.openai.com వెబ్‌సైట్ ను గడిచిన వారంలో రోజుకు 25 మిలియన్ల మంది విజిట్ చేశారు. జనవరి 31న అత్యధికంగా 28 మిలియన్ల మంది యూజర్లు ఉపయోగించారు. సాధారణ రోజుల్లో మాత్రం సగటున రోజుకు 15.7 మిలియన్ల మంది యాప్ ను ఉపయోగించారు.

2022 డిసెంబర్‌లో చాట్ జీపీటీని అందుబాటులోకి తెచ్చారు. ఇది బ్రౌజర్ పై పనిచేసే టూల్. మనకు కావాల్సినది వాయిస్ ద్వారా చెబితే చాలు మొత్తం ఇంటర్నెట్ ను శోధించి కావాల్సింది మన ముందుంచుతుంది. వికీపీడియా, దేశ విదేశాల పత్రికలు, ఆన్‌లైన్ గ్రంథాల్లో అందుబాటులో ఉన్న లక్షల పుటల సమాచారాన్ని సంగ్రహించగలదు. మన ప్రశ్నలకు సమాధానాలను క్షణాల్లో టెక్స్ట్ రూపంలో అందిస్తుంది. 

చాట్ జీపీటీ మానవ మేధలా తనకు అందుబాటులో ఉన్న డేటా మధ్య సంబంధాన్ని గుర్తించి, వాటి మధ్య ఉన్న భేదాలను సమన్వయపరిచి జవాబులిస్తుంది. అందుకే ఇది మనుషులనే మించిపోతుందేమోననే భయాలు మొదలయ్యాయి. గూగుల్‌తో పాటు ఇతర ఇంటర్నెట్ దిగ్గజాలకు ఆందోళన మొదలైంది. చాట్ జీపీటీని తలదన్నే విధంగా కృత్రిమ మేధ గల వెబ్‌సైట్ రూపొందించాలని గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది.

ఓపెన్ఏఐ ఇటీవల చాట్ జీపీటీ ప్లస్ మోడల్‌ను తీసుకొచ్చింది. దీని సబ్‌స్క్రిప్షన్ కోసం నెల వారీగా 20 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే చాట్ జీపీటీ ప్లస్ అందుబాటులో ఉంది. దీని ద్వారా పీక్ టైమ్ లోనూ యూజర్లు సేవలను పొందవచ్చు. అలాగే కొత్త ఫీచర్లను పొందవచ్చు.

More Telugu News