జగన్ ను లోకేశ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు: కొడాలి నాని

  • పాదయాత్ర కొనసాగిస్తున్న లోకేశ్
  • జగన్ ను ఒరేయ్, అరేయ్ అంటున్నాడని నాని ఆగ్రహం
  • చంద్రబాబు, లోకేశ్ నారావారిపల్లె నుంచి వలస వెళ్లారని వ్యాఖ్యలు
  • జగన్ ను తిడుతూ శునకానందం పొందుతున్నారని విమర్శలు
Kodali Nani slams Nara Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై వైసీసీ ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. పాదయాత్రలో లోకేశ్ నోరు పారేసుకుంటున్నారని, జగన్ ను ఒరేయ్, అరేయ్ అంటున్నారని మండిపడ్డారు. కనీసం మంగళగిరిలో ఓ అభ్యర్థిగా గెలవలేని లోకేశ్ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 

లోకేశ్ పాదయాత్రలో కనీసం 10 కిలోమీటర్లు కూడా నడవలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో లోకేశ్ స్కూలు పిల్లలతో జూమ్ మీటింగ్ నిర్వహించాడని, ఆ మీటింగ్ లోకి తాను, వల్లభనేని వంశీ ఎంటరయ్యేసరికి లోకేశ్ తెల్లముఖం వేశాడని వ్యంగ్యం ప్రదర్శించారు.

పాదయాత్ర సందర్భంగా, పలు గ్రామాల్లోని ప్రజలు వలస వెళ్లారని లోకేశ్ అంటున్నాడని, వలస వెళ్లింది ప్రజలు కాదని, నారావారిపల్లె నుంచి చంద్రబాబు, లోకేశ్ లే వలస వెళ్లారని కొడాలి నాని విమర్శించారు. 

వీళ్లకుతోడు దత్తపుత్రుడు కూడా తయారయ్యాడని, ఏపీకి వచ్చినప్పుడల్లా... నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, ఇక్కడ చదువుకున్నాను అని చెబుతుంటాడని, ఆ దత్తపుత్రుడు కూడా వలస వెళ్లాడని అన్నారు. వీళ్లందరికీ జగన్ పై పడి ఏడవడంతప్ప మరో పని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శునకానందం పొందుతున్నారని విమర్శించారు. 

"బాబాయ్ ని గొడ్డలితో కొట్టారని మీరు చెబుతారు... మరీ మీ బాబాయ్ ఎక్కడున్నాడో ఓసారి మీడియా ముందుకు తీసుకురా" అంటూ లోకేశ్ ను ఉద్దేశించి నాని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ... ఈ కేసులోకి వైఎస్ భారతమ్మను అనవసరంగా లాగుతున్నారని మండిపడ్డారు. 

సీఎం జగన్ తన కార్యాలయం నుంచి ఒక్కసారి ఇంటికి వెళ్లిపోయారంటే ఆయనతో తాము ఎవరైనా మాట్లాడాలంటే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికో, లేక సహాయకుడు నవీన్ కో ఫోన్ చేయాల్సి ఉంటుందని, ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ఆ విధంగానే ఫోన్ చేసి ఉంటాడని కొడాలి నాని స్పష్టం చేశారు. దీనికి ఇంత రాద్ధాంతం చేస్తారెందుకు? అంటూ ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు, చంద్రబాబులపై ధ్వజమెత్తారు. 

"వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారు? జిల్లా ఎస్పీ, డీజీపీ ఏం మాట్లాడుకున్నారు? ఆ జిల్లా టీడీపీ నేతలు, చంద్రబాబు, లోకేశ్ ఏం మాట్లాడుకున్నారు? దీనిపైన కూడా సీబీఐ ఎంక్వైరీ చేయాలి. వీళ్లందరి ఫోన్ కాల్స్ పైనా విచారణ జరపాలి" అని కొడాలి నాని డిమాండ్ చేశారు.

More Telugu News