హామీలు ఇస్తారు కానీ అమలు చేయరన్న అక్బరుద్దీన్ ఒవైసీ... మండిపడిన తెలంగాణ మంత్రులు

  • కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • సభలో నేడు ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్
  • అభివృద్ధిపై నిలదీసిన అక్బరుద్దీన్ ఒవైసీ
  • సీఎం, మంత్రులు తమను కలవరంటూ ఆరోపణ
  • ఆయనసలు బీఏసీకే రారన్న కేటీఆర్
  • గొంతు చించుకుంటే ఉపయోగం ఉండదని హితవు
Its MIM Vs BRS in Telangana assembly budget sessions

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నేడు వాడీవేడి వాదనలు చోటుచేసుకున్నాయి. ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుదీన్ ఒవైసీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అసెంబ్లీలో హామీలు ఇస్తారు... కానీ అమలు చేయరు అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శనాస్త్రాలు సంధించారు. 

పాతబస్తీలో మెట్రో సంగతి ఏమైంది? ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటి? అంటూ అభివృద్ధిపై నిలదీశారు. రాష్ట్రంలో ఉర్దూ రెండో భాష అయినప్పటికీ, తమకు అన్యాయమే జరుగుతోందని అక్బర్ ఆక్రోశించారు. పదేళ్లలో తన నియోజకవర్గానికి ఒక స్టేడియం మంజూరైతే, ఇప్పటికీ అది పూర్తికాలేదని అన్నారు. మాట్లాడదామంటే సీఎం, మంత్రులు తమకు అవకాశం ఇవ్వరని ఆరోపించారు. మీరు చప్రాసీని చూపిస్తే వారినైనా కలిసి మాట్లాడతామని అక్బరుద్దీన్ ఒవైసీ వ్యంగ్యంగా అన్నారు.  

అయితే, అక్బర్ తీవ్రస్వరంతో చేసిన ప్రసంగం పట్ల మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు. సభ అన్న తర్వాత కొన్ని మర్యాదలు ఉంటాయని తెలిపారు. 

"వాళ్లకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటే మాకు 105 మంది ఉన్నారు. తక్కువ మంది సభ్యులు ఉన్నవాళ్లకే సభలో మాట్లాడేందుకు గంట పాటు సమయం ఇస్తుంటే, ఆయన (అక్బరుద్దీన్) గవర్నర్ ప్రసంగం మీద కాకుండా బడ్జెట్ మీద, మున్సిపల్ పద్దు మీద మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అందుకు మేం అభ్యంతర పెడుతుంటే ఆయనకు అంత ఆవేశం ఎందుకు?" అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అక్బరుద్దీన్ బీఏసీకి రాకుండా ఈ విధంగా మాట్లాడడం సబబు కాదని అన్నారు. మంత్రులు అందుబాటులో లేరనడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. 

ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ... అక్బరుద్దీన్ ఇంతకుముందు బాగానే మాట్లాడేవారని, ఇప్పుడు ఆయనకు ఎందుకంత కోపం వస్తోందో అర్థం కావడంలేదని అన్నారు.

More Telugu News