కొత్త పన్ను విధానంలోనూ కొన్ని పన్ను మినహాయింపులు

  • రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్
  • దీనికి అదనంగారూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్
  • ఉద్యోగి ఎన్ పీఎస్ ఖాతాకు సంస్థ చేసే జమపైనా పన్ను మినహాయింపు
deductions that can be claimed under new income tax regime

2023-24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నూతన పన్ను విధానంలో కొన్ని ఆకర్షణీయమైన ప్రతిపాదనలు చేశారు. ప్రధానంగా పన్ను రేట్ల తగ్గింపు ఇందులో ఒకటి. రూ.7 లక్షల వరకు ఆదాయం ఉంటే కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లించే అవసరం లేకుండా రిబేట్ కల్పించారు. కాకపోతే పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం మధ్య ఉన్న వ్యత్యాసాలు పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపుల ప్రయోజనాలే.


పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ, 80డీ, 80సీసీడీ (1), 80సీసీడీ (2), 80సీసీడీ (1బీ), సెక్షన్ 24, స్టాండర్డ్ డిడక్షన్ వంటి ప్రయోజనాలుఎన్నో ఉన్నాయి. నూతన విధానంలో వీటిల్లో చాలా వరకు ఉండవు. అందుకనే ఆర్థిక మంత్రి కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను రిబేట్ ఇచ్చారు. సరళంగా ఉండే కొత్త పన్ను విధానంలోకి ఎక్కువ మందిని తీసుకువచ్చే లక్ష్యంతో పన్ను రేట్లను తగ్గించారు. అయితే, కొత్త పన్ను రేటుకు మారే వారు అందులోనూ రెండు రకాల డిడక్షన్ ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు.

1. స్టాండర్డ్ డిడక్షన్
వేతన జీవులు, పెన్షనర్లు రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనానికి నూతన పన్ను విధానంలోనూ అర్హులు. అంటే బేసిక్ రూ.7 లక్షలకు ఇది కూడా కలుపుకుంటే రూ.7.5 లక్షల ఆదాయంపై పన్నులేదు. స్టాండర్డ్ డిడక్షన్ కు ఎలాంటి డాక్యుమెంట్ సమర్పించాల్సిన అవసరం లేదు. 

2. ఎన్ పీఎస్ చందా
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పీఎస్) అన్నది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే పెన్షన్ స్కీమ్. పాత పన్ను విధానంలో అయితే ఇందులో రూ.50,000 ఇన్వెస్ట్ చేసుకుని, సెక్షన్ 80సీకి అదనంగా ఈ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగి తరఫున సంస్థ చేసే జమపైనా పన్ను మినహాయింపు ఉంది. నూతన పన్ను విధానంలో కేవలం, ఉద్యోగి తరఫున సంస్థ అతడి ఎన్ పీఎస్ ఖాతాకు జమ చేస్తే అప్పుడు సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను ప్రయోజనం ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రైవేటు ఉద్యోగులు అయితే వారి మూలవేతనం, డీఏలో 10 శాతం జమపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే వేతనంలో 14 శాతం ప్రభుత్వ జమపై పన్ను పడదు.

More Telugu News