విజయ్, లోకేశ్​ కనగరాజ్ సినిమాకు వెరైటీ టైటిల్

  • ‘లియో’ అనే టైటిల్ ఖరారు చేసిన చిత్ర బృందం
  • 14 ఏళ్ల తర్వాత విజయ్ సరసన హీరోయిన్ గా త్రిష
  • అక్టోబర్ 19న విడుదల కానున్న చిత్రం
Vijay thalapathy and lokesh kanagaraj new movie leo first glimpse

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘మాస్టర్’ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత విజయ్.. బీస్ట్, వారసుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తమిళ్ లో ఈ రెండూ హిట్ అయ్యాయి. మరోవైపు లోకేశ్ కనగరాజ్.. సీనియర్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో చేసిన విక్రమ్ తో భారీ విజయం సొంతం చేసుకొని స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఆయన దర్శకత్వంలో నటించేందుకు దక్షిణాదిలోని అన్నిభాషల హీరోలు ఆసక్తిగా ఉన్నారు. లోకేశ్ మాత్రం మరోసారి విజయ్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా మొదలైంది. కశ్మీర్‌‌లో షూటింగ్ జరుపుకుంటోంది.  

ఇక ఈ చిత్రానికి ‘లియో’ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ ను రివీల్ చేస్తూ చిన్న వీడియోను సైతం చిత్ర బృందం విడుదల చేసింది. ఓ ఇంట్లో చాక్లెట్స్ తయారు చేస్తూ కనిపించిన విజయ్.. భారీ ఖడ్గాన్ని చాక్లెట్ క్రీమ్‌లో ముంచి బయటికి తీస్తూ ‘బ్లడీ స్వీట్’ అంటూ కామెంట్ చేశాడు. వెనకాల నల్లత్రాచు బుసలు కొడుతూ కనిపించడంతో ఇది గ్యాంగ్‌స్టర్‌‌ బ్యాక్ డ్రాప్ లో నడిచే చిత్రం అనిపిస్తోంది. ఈ చిత్రంలో పద్నాలుగేళ్ల తర్వాత విజయ్, త్రిష జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌, అర్జున్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News