Posani Krishna Murali: ఈ పదవితో ఎంత మేలు చేస్తానో తెలియదు కానీ కీడు మాత్రం చేయను: ఏపీఎఫ్ డీసీ చైర్మన్ పోసాని

  • కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పోసాని 
  • సీఎం జగన్ తనకు 11 ఏళ్లుగా తెలుసని వెల్లడి
  • ఆయన జనంలోంచి వచ్చిన నాయకుడు అని కితాబు
Posani takes charge as APFDC chairman

టాలీవుడ్ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిని వైసీపీ ప్రభుత్వం ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్ డీసీ) చైర్మన్ గా నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పోసాని కృష్ణమురళి నేడు బాధ్యతలు చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీఎఫ్ డీసీ చైర్మన్ గా చిత్ర పరిశ్రమకు ఎంత మేలు చేస్తానో తెలియదు కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు మాత్రం తలపెట్టనని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తప్పకుండా సహకారం అందిస్తానని అన్నారు. సీఎం జగన్ తనకు పదకొండేళ్లుగా తెలుసని, ఆయన జనంలో నుంచి వచ్చిన నాయకుడు అని కొనియాడారు. 

కాగా, ఏపీఎఫ్ డీసీ చైర్మన్ పదవీబాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, మల్లాది విష్ణు, ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, జగన్ కోసం ఎంతదూరమైనా వెళ్లే వ్యక్తిగా పోసాని కృష్ణమురళికి గుర్తింపు ఉందని, పోసాని, సీఎం జగన్ ఎంతో ఆత్మీయులు అని వెల్లడించారు. వైజాగ్ లో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనేది ఏపీ ప్రభుత్వ సంకల్పం అని, ఇప్పుడా బాధ్యతలు పోసానికి అందించడం జరిగిందని వివరించారు. విశాఖలో వంద ఎకరాల భూమిలో స్టూడియోలు నిర్మించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్ని నాని తెలిపారు.

More Telugu News