Gautam Adani: బ్లూంబెర్గ్ కుబేరుల జాబితాలో 21వ స్థానానికి పడిపోయిన అదానీ

Adani slips to 21st spot
  • అదానీ గ్రూప్ పాలిట ప్రతికూలంగా మారిన హిండన్ బర్గ్ నివేదిక
  • అదానీ సంస్థలపై లక్షల కోట్ల రుణభారం ఉందన్న హిండన్ బర్గ్
  • భారీగా పతనమైన అదానీ కంపెనీల షేర్లు
  • 3 రోజుల్లో రూ.5 లక్షల కోట్లు హాంఫట్
హిండన్ బర్గ్ నివేదిక వెలువడిన అనంతరం అదానీ వ్యాపార సామ్రాజ్యం తీవ్ర కుదుపులకు లోనవుతోంది. అదానీ గ్రూప్ లోని సంస్థలపై రుణభారం లక్షల కోట్లలో ఉందని, ఆ భారీ రుణాలు తీర్చే మార్గాలను వెదకడంలో అదానీ గ్రూప్ సంస్థలు విఫలమవుతున్నాయని హిండన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో, గౌతమ్ అదానీ సంపద భారీగా పతనమైంది. 3 రోజుల వ్యవధిలో రూ.5 లక్షల కోట్లను కోల్పోయారు. 

తాజాగా ఆయన అంతర్జాతీయ కుబేరుల జాబితాలో 21వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన నికర సంపద విలువ 61.3 బిలియన్ డాలర్లు. ఇటీవలే అదానీని వెనక్కినెట్టి అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ భారత కుబేరుడిగా ముఖేశ్ అంబానీ తన పాతస్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడం తెలిసిందే. ముఖేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ 82.2 బిలియన్ డాలర్లు. 

ఇక బ్లూంబెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 217.5 బిలియన్ల డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (183.2 బిలియన్ డాలర్లు), మూడోస్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (136 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
Gautam Adani
Bloomberg
Rich List
Hindenburg

More Telugu News