నా గొంతు అణచాలనుకుంటే ఎన్ కౌంటరే మార్గం: కోటంరెడ్డి

  • సజ్జల ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • తన అరెస్టుకు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారని మండిపడ్డ రెబెల్ ఎమ్మెల్యే
  • శాశ్వతంగా జైలులో పెట్టినా తన గొంతు ఆగదని తేల్చిచెప్పిన కోటంరెడ్డి
kotam reddy fires on sajjala in pressmeet

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆడియోలు వదులుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ తిరుగుబాటు నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. సజ్జలతో పాటు వైసీపీ మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు తనపై చేసిన ఆరోపణలకు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. తన అరెస్టుకు రంగం సిద్ధమైందని సజ్జల లీకులు వదులుతున్నారని ఆరోపించారు. సజ్జలకు అమెరికా అధ్యక్షుడికి సలహాదారుడిగా ఉండేంత పరిజ్ఞానం ఉందని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు.

థియేటర్ యజమానుల నుంచి నెలనెలా రూ.2 లక్షల చొప్పున వసూలు చేస్తున్నానంటూ తనపై విష ప్రచారం చేస్తున్నారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. జీవితాంతం జైలులో ఉంచినా తన గొంతు మాత్రం అణచలేరని తేల్చిచెప్పారు. తన గొంతును నొక్కేయాలంటే ఒక్కటే పరిష్కారం ఉందని.. అది ఎన్ కౌంటర్ చేయించడమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబును కలిశానని చెబుతున్న డిసెంబర్ 25 వ తేదీన తాను క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నానని కోటంరెడ్డి వివరణ ఇచ్చారు. టీడీపీ అధినేతను తాను కలవలేదని స్పష్టం చేశారు. టీడీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిందన్న ఆరోపణలను కోటంరెడ్డి తిప్పికొట్టారు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల సమయంలోనే తేలుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

More Telugu News