లంగ్ కేన్సర్ ప్రాథమిక దశ లక్షణాలు ఇలా..!

  • మన దేశంలో పెరిగిపోతున్న లంగ్ కేన్సర్ కేసులు
  • పొగతాగే వారిలో ఎక్కువ రిస్క్
  • ఆస్బెస్టాస్, డీజిల్ వాహనాల పొగకు దూరంగా ఉండాలి
  • ముందస్తు చెకప్ అవసరం
First signs of lung cancer prevention tips by expert

మన దేశంలో లంగ్ కేన్సర్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. సాధారణంగా పొగతాగే అలవాటు ఉన్న వారికి కేన్సర్ రిస్క్ ఎక్కువ. ఒకరు తాగి వదిలిన పొగను పీల్చినా (ప్యాసివ్ స్మోకింగ్) వారికి కూడా కేన్సర్ రిస్క్ ఉంటుంది. ప్రమాదరకమైన విషయం ఏమిటంటే పొగతాగే అలవాటు లేని వారిలోనూ కేన్సర్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా మగవారిలో వచ్చే లంగ్ కేన్సర్ కేసుల్లో ఎక్కువ మందికి పొగతాగడం వల్లేనని వైద్యులు చెబుతున్నారు. పొగతాగడం వల్ల ఊపిరితిత్తుల్లోని కణాలు దెబ్బతింటున్నట్టు చెబుతున్నారు. 

పొగతాగడం వల్ల కలిగిన నష్టాన్ని సరిచేసుకునే ప్రయత్నం మొదట్లో జరుగుతుందని, కొంత కాలం తర్వాత కణాలు అసాధారణంగా స్పందించడం మొదలై కేన్సర్ కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. కేన్సర్ వచ్చిన వారిలో ఎక్కువ మందిలో లక్షణాలు ముందుగా గుర్తించలేరు. కొందరిలో కనిపించవు కూడా. మరి దీన్ని గుర్తించేందుకు ఆ లక్షణాలు ఏవన్నది చూస్తే.. 

లక్షణాలు
అపోలో హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ ప్రవీణ్ గార్గ్ చెబుతున్న దాని ప్రకారం.. లంగ్ కేన్సర్ ఆరంభ దశలో విడవకుండా దగ్గు వస్తుంటుంది. రక్తంతో కూడిన కఫం లేదంటే తుప్పు రంగుతో కూడిన కఫం రావడం, ఛాతీలో నొప్పి కనిపిస్తాయి. దగ్గినప్పుడు, దీర్ఘ శ్వాస తీసుకున్నప్పుడు నొప్పి పెరిగిపోతుంది. గొంతు బొంగురుపోవడం (బొంగురు స్వరం), ఆకలి తగ్గిపోవడం, బరువు కూడా అసాధారణంగా తగ్గడం, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం, అలసిపోవడం లేదా బలహీనత, తరచూ ఇన్ఫెక్షన్ బారిన పడుతుండడం, వచ్చింది తగ్గకపోవడం, బ్రాంకైటిస్, న్యూమోనియా సైతం తగ్గకపోవడం, గురక ఇవన్నీ కూడా కేన్సర్ లక్షణాలు కావచ్చు. కేన్సర్ ముదురుతోందనడానికి నిదర్శనంగా కాల క్రమేణా ఈ లక్షణాలే మరింత తీవ్రతరమవుతాయి. 

నివారణ..
పొగతాగకపోవడం, తాగే వారికి దూరంగా ఉండడం అవసరమని డాక్టర్ గార్గ్ సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో పండ్లూ, కూరగాయలకు తప్పక ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. తమ కుటుంబంలో ఎవరికైనా కేన్సర్ ఉంటే, ముందు నుంచే చెకప్ చేయించుకోవాలి. ఆస్బెస్టాస్, ఆర్సెనిక్, డీజిల్ వాహనాలు విడుదల చేసే పొగకు దూరంగా ఉండాలి. శారీరక వ్యాయామాలు, యోగాతో మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఏటా కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం అవసరం.

More Telugu News