K Vishwanath: కళాతపస్వి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్, జగన్, చంద్రబాబు

KCR Jagan Chandrababu pays condolences to K Vishwanath
  • తెలుగు సినిమా ఉన్నంత కాలం విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందన్న కేసీఆర్
  • ఆయన మరణం విచారానికి గురి చేసిందన్న జగన్
  • విశ్వనాథ్ మృతి వార్త కలచి వేసిందన్న చంద్రబాబు
ప్రముఖ సినీ దర్శకుడు, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో టాలీవుడ్ మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు శ్రీ కె. విశ్వనాథ్ అని కేసీఆర్ కొనియాడారు. దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులతో సత్కారం వారి దర్శక ప్రతిభకు నిదర్శనమని అన్నారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని చెప్పారు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ... విశ్వనాథ్ గారి మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని అన్నారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌ గారని కొనియాడారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయని అన్నారు. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ... ప్రముఖ సినీ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ గారి మృతి తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. విశ్వనాథ్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
K Vishwanath
KCR
BRS
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News