పఠాన్ దర్శకుడితో ప్రభాస్ కొత్త సినిమా!

  • మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మాణంలో చిత్రం
  • షారుఖ్ హీరోగా నటించిన పఠాన్ కు వసూళ్ల వర్షం 
  • భారీ హిట్ రావడంతో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పై అందరి దృష్టి
Prabhas new movie with siddarth anand

‘రాధేశ్యామ్’ డిజాస్టర్ తర్వాత ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఆశిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన చేతిలో ఇప్పటికే ఐదు ప్రాజెక్టులున్నాయి. అవన్నీ ప్యాన్ ఇండియా స్థాయి చిత్రాలే. ఇప్పుడు మరో ప్యాన్ ఇండియా చిత్రానికి ప్రభాస్ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ నయా బ్లాక్ బస్టర్ ‘పఠాన్‌’కు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తాడని తెలుస్తోంది. 

హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా వచ్చిన ‘పఠాన్’ భారీ విజయంతో పాటు వందల కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. కొన్నాళ్లుగా వరుస వైఫల్యాల్లో ఉన్న బాలీవుడ్ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌పై పడింది. ఆయన మాత్రం ప్రభాస్ తో తన సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ  మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. 

ఈ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యెర్నేని బుధవారం దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ని కలిశారు. ‘పఠాన్‌’ అందుకున్న విజయానికి ఆయనను అభినందించారు. మైత్రీ మూవీస్ తో చిత్రం చేసేందుకు సిద్ధార్థ్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాడు. అది ప్రభాస్ తోనే అని తెలుస్తోంది. దీని గురించే నవీన్ యెర్నేని సిద్ధార్థ్ ఆనంద్ తో చర్చించారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం 2024లో పట్టాలెక్కనుందని సమాచారం. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

More Telugu News