Australia: 5 డాలర్ల కరెన్సీ నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా

Australia To Replace Queen Elizabeths Image On note
  • స్వదేశీ సంస్కృతి ప్రతిబింబించేలా డిజైన్‌ రూపొందిస్తామన్న ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్
  • నోటు ముద్రణకు కొన్నేళ్లు పట్టే అవకాశం ఉందని వెల్లడి 
  • అప్పటిదాకా ప్రస్తుత నోటు చలామణిలో ఉంటుందని  ప్రకటన
క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ఫొటోని తమ కరెన్సీ నోటు నుంచి తొలగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 డాలర్ల నోటు నుంచి క్వీన్ ఫోటోను తీసివేసి.. స్వదేశీ సంస్కృతి, చరిత్రలు ప్రతిబింబించేలా, గౌరవించేలా కొత్త డిజైన్‌ను రూపొందించనున్నట్టు ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

5 డాలర్ల నోటుకు ఒకవైపు క్వీన్ ఎలిజబెత్ 2 ఫోటో, మరోవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనం ఉంటాయి. తాజా మార్పుల్లో భాగంగా ఎలిజబెత్ ఫోటోను మాత్రమే తొలగించి, పార్లమెంట్ భవనాన్ని కొనసాగిస్తామని ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది.

బ్రిటన్ తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ఇతర 12 కామన్వెల్త్ దేశాలకు అధిపతిగా క్వీన్ ఎలిజబెత్ ఉండే వారు. ఈ అంశంపై ఆస్ట్రేలియాలో 1999లో రెఫరెండం నిర్వహించగా.. ప్రజలు రాజ్యాంగ అధినేతగా క్వీన్ ఉండాలని తీర్పునిచ్చారు. గతేడాది సెప్టెంబర్ లో క్వీన్ ఎలిజబెత్ చనిపోయారు. దీంతో ఆస్ట్రేలియాలో రాజ్యాధినేత భవిష్యత్తు గురించి చర్చకు దారితీసింది. ప్రస్తుతం రాజ్యాంగ అధినేతగా క్వీన్ కుమారుడు చార్లెస్ 3 ఉన్నారు.

కొత్త కరెన్సీ నోటు రూపకల్పన విషయంలో స్వదేశీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతామని ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కొత్త నోటు రూపకల్పన, ముద్రణకు కొన్ని ఏళ్లు పడుతుందని.. అప్పటి వరకు ప్రస్తుత నోటు చలామణిలో ఉంటుందని వెల్లడించింది.
Australia
Queen Elizabeth
British monarch

More Telugu News