దొంగ లెక్కలు.. బోగస్ కబుర్లతో కామెడీ పీస్ గా మారిన సీఎం జగన్: యనమల

  • కేంద్ర బడ్జెట్ పై వైసీపీ నాయకులది అవగాహనలేమి అన్న యనమల 
  • నాలుగేళ్ల పాలనలో వృద్ధి రేటును 4 శాతానికి దిగజార్చారని విమర్శ 
  • వృద్ధి రేటు, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ  సవాల్
tdp politbeuro member yanamala press note

కేంద్ర బడ్జెట్ పై వైసీపీ నాయకులు అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. మంత్రి బుగ్గన ఈ బడ్జెట్ బ్రహ్మండంగా ఉందని అంటుండగా.. నిరాశాజనకంగా ఉందని ఎంపీ మిథున్ రెడ్డి అంటున్నారని చెప్పారు. పైగా ప్రీబడ్జెట్ సమావేశాల్లో తాము చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర బడ్జెట్ తయారు చేశారంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని యనమల మండిపడ్డారు. ఓవైపు రాష్ట్రానికి అన్యాయం జరిగితే నోరు మెదపకుండా ఇది మా గొప్పతనమేనని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఈమేరకు గురువారం యనమల రామకృష్ణుడు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

32 మంది ఎంపీలు ఉండీ నోరెత్తడంలేదేం?
‘వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు నిధుల కేటాయింపు జరగకపోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. కేంద్ర విద్యాసంస్థలకు నిధులు తగ్గించారని మీకు అనిపించలేదా? విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ, మెట్రో రైలు, రాజధాని నిర్మాణం ఊసే లేకపోవడం ఏపీ ప్రభుత్వం సాధించిన ఘనతా? రైతులు, మహిళలకు చేయూత పథకాలకు కేటాయింపుల్లో కోత మీకు కనిపించడంలేదా? ప్రత్యేక హోదా, పోలవరంపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నా 32 మంది ఎంపీలు ఉండి కూడా నోరు మెదపలేకపోవడానికి కారణమేంటి?’ అని యనమల నిలదీశారు.

రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశారు..
జీఎస్ డీపీలో 11.43 శాతం వృద్దిరేటుతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందంటూ దొంగ లెక్కలు చెబుతూ సీఎం జగన్ నవ్వుల పాలయ్యారని, రాష్ట్రాన్నీ నవ్వుల పాలు చేశారని యనమల మండిపడ్డారు. వృద్ధి రేటు, సంక్షేమంపై సవాల్ చేస్తే పారిపోయాడని అన్నారు. ఇప్పుడైనా వాస్తవాలను చర్చించే ధైర్యముంటే ముందుకు రావాలని యనమల సవాల్ చేశారు. స్థిర రేటు (కాన్ సెంట్) గణాంకాల ప్రకారం గత 4ఏళ్లలో ఏపీ జీఎస్ డీపీ వృద్ధిరేటును -4 శాతం (మైనస్ నాలుగు)కు దిగజార్చారు. మొత్తం అన్ని రంగాలనూ తిరోగమనం వైపు వెళ్లేలా చేశారు. మైనస్ 4 గ్రోత్ దేశానికే ఆదర్శమంటారా..? కరెంటు ఛార్జీలు ఏడుసార్లు పెంచడమా దేశానికే ఆదర్శం..? అన్నా కేంటిన్లు మూసేసి పేదల పొట్ట కొట్టడం దేశానికే ఆదర్శమా..? పేదల సంక్షేమ పథకాలు 39 రద్దు చేయడమా దేశానికే ఆదర్శం..? ఎందులో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారని ముఖ్యమంత్రి జగన్ ను యనమల ప్రశ్నించారు.

తలసరి ఆదాయం ఎందుకు తగ్గింది..?
నాలుగేళ్ల మీ పాలనలో తలసరి ఆదాయం ఎందుకు తగ్గిందని ముఖ్యమంత్రి జగన్ ను యనమల సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం ఎందుకు పెరిగిందని, రూ.10 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయని అడిగారు. టీడీపీ పాలనలో రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించగా ప్రస్తుతం మైనస్ 4 శాతానికి పడిపోయిందని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో ఎఫ్ డీఐలలో రెండు, మూడు స్థానాలలో ఉన్న రాష్ట్రాన్ని 13, 19 స్థానాలకు దిగజార్చడమేనా వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని అన్నారు. నాలుగేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 1.22 లక్షల కోట్ల వివరాలు వెల్లడించాలని యనమల డిమాండ్ చేశారు. ఈ మొత్తంతో రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఎన్ని ఆస్తులు సృష్టించారని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో టీడీపీ రెండు శ్వేత పత్రాలను విడుదల చేసిందని గుర్తుచేస్తూ.. వైసీపీ ప్రభుత్వానికి సామాజిక బాధ్యత లేదా? అని నిలదీశారు. పెరిగిన రాష్ట్ర ఆదాయాన్ని వైసీపీ నేతలు మింగేశారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైందని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

More Telugu News