మొన్న ఉగ్రవాది.. ఇప్పుడు గూఢచారిగా కనిపించనున్న సమంత!

  • ‘సిటాడెల్’ హిందీ వెబ్ సిరీస్‌ లో సమంత కీలక పాత్ర
  • సమంత స్టయిలిష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర బృందం
  • ఫ్యామిలీ మ్యాన్2 సిరీస్ లో ఉగ్రవాది పాత్రలో మెప్పించిన సమంత
SAMANTHA RUTH PRABHU JOINS VARUN DHAWAN IN INDIAN INSTALMENT OF CITADEL

ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన సమంత పుష్ప సినిమాలో ప్రత్యేక పాటతో హిందీలో చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత హిందీలో ఆమె మరో వెబ్ సిరీస్‌ కు ఓకే చెప్పింది. అమెరికన్ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్’కు హిందీ రీమేక్ ఇది. హిందీలోనూ సిటాడెల్ అనే పేరునే వస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే దీన్ని రూపొందిస్తున్నారు. 

ఇక ఈ ప్రాజెక్ట్‌లోకి సమంతకు స్వాగతం చెబుతూ ఆమె పాత్రకు ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. లెదర్ జాకెట్, డెనిమ్ జీన్స్‌ ధరించి, కళ్ల జోడు పెట్టుకున్న సమంత చాలా స్టయిలిష్ లుక్ లో లేడీ జేమ్స్‌ బాండ్‌లా కనిపించింది. అమెరికన్ వెబ్‌ సిరీస్‌ లో ప్రియాంక చోప్రా చేసిన ఏజెంట్ నాదియా సింగ్ పాత్రను ఇక్కడ సమంత పోషిస్తోంది. 

ఫ్యామిలీ మ్యాన్2లో ఉగ్రవాదిగా కనిపించి మెప్పించిన ఆమె ఇప్పుడు గూఢచారి పాత్రలో ప్రేక్షకులను అలరించనుంది. మయో సైటిస్‌ కారణంగా గత కొన్ని నెలలుగా షూటింగ్‌కి దూరంగా ఉన్న సమంత ఇప్పుడు అదిరిపోయే లుక్ లో కనిపించి ఇప్పటికే ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. భారత్ తో పాటు సెర్బియా, దక్షిణాఫ్రికాలోనూ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. కాగా, విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తున్న చిత్రం ‘ఖుషీ’ షూటింగ్ తదుపరి షెడ్యూల్ కూడా ఈ వారంలోనే మొదలవనుంది. మరోవైపు సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ రూపొందించిన ‘శాకుంతలం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

More Telugu News