Tollywood: టాలీవుడ్ లో మరో విషాదం.. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ సాగర్ కన్నుమూత

Veteran Telugu Film director Sagar passes away
  • అనారోగ్యంతో ఈ ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచిన సాగర్
  • స్టూవర్ట్‌పురం దొంగలు, అమ్మ దొంగ, ఖైదీ బ్రదర్స్ చిత్రాలతో గుర్తింపు
  • తెలుగు దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా సేవ చేసిన సాగర్
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు సాగర్ (70) ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు విద్యా సాగర్ రెడ్డి.  1983లో నరేశ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాకాసి లోయ’ సినిమాతో దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 'ఖైదీ బ్రదర్స్', 'స్టూవర్ట్‌పురం దొంగలు', 'అమ్మ దొంగ', 'రామ సక్కనోడు', 'యాక్షన్ నెం.1', 'అన్వేషణ', ‘ఓసి నా మరదల' వంటి పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

తెలుగు సినిమా దర్శకుల సంఘానికి సాగర్ మూడుసార్లు అధ్యక్షుడిగా కూడా పని చేశారు. శ్రీను వైట్ల, వి.వి.వినాయక్, రవి కుమార్ చౌదరి, జి. నాగేశ్వర రెడ్డి వంటి అనేక మంది టాలీవుడ్ ప్రస్తుత తరం దర్శకులు టాలీవుడ్‌లో అగ్ర దర్శకులుగా మారడానికి ముందు సాగర్ వద్ద పని చేశారు. సాగర్ 1952లో గుంటూరులో జన్మించారు. 1983లో దర్శకుడిగా కెరీర్ ఆరంభించే ముందు అనేక తెలుగు సినిమాలకు ఫిల్మ్ ఎడిటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, వివిధ హోదాల్లో పనిచేశారు. 1991లో వచ్చిన 'స్టూవర్ట్‌పురం దొంగలు' సినిమాతో అగ్ర దర్శకుడిగా మారారు. సాగర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను ఈ సాయంత్రం చెన్నైలో నిర్వహించనున్నారు.
Tollywood
director
Sagar
passes
away

More Telugu News