Khula: భర్తకు ముస్లిం మహిళ విడాకులు.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

  • ‘ఖులా’ కోసం ప్రైవేటు సంస్థలను ఆశ్రయించడం సరికాదన్న కోర్టు
  • కుటుంబ న్యాయస్థానం ద్వారా ‘ఖులా’ హక్కును ఉపయోగించుకోవచ్చని తీర్పు
  • తౌహీద్ జామత్ జారీ చేసిన ఖులా సర్టిఫికెట్‌ను రద్దు చేసిన న్యాయస్థానం
Muslim Women Can Approach Family Court For Divorce Says Madras High Court

ముస్లిం మహిళల విడాకుల వ్యవహారంలో మద్రాస్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. షరియత్ కౌన్సిల్ వంటి ప్రైవేటు సంస్థలకు బదులుగా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా ముస్లిం మహిళల ‘ఖులా’ ద్వారా వివాహాన్ని రద్దు చేసుకునే హక్కును ఉపయోగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. 

ఖులా (అరబిక్‌లో ఖుల్ అంటారు) అనేది ఇస్లాంలో ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చే ఓ ప్రక్రియ. వివాహం సమయంలో భర్త నుంచి పొందిన కట్నం (మహర్)‌ లేదంటే మరిదేన్నయినా కానీ తిరిగి ఇవ్వడం ద్వారా, లేదంటే ఇవ్వకుండా కూడా ఖులా ద్వారా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. అయితే, ఇందుకు జీవిత భాగస్వామి కానీ, ఖాదీ (కోర్టు) కానీ అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారికి ఖులా ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. 

ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది తలాక్‌కు మరో రూపం. తలాక్‌లో భర్త భార్యకు చెబితే.. ఖులాలో భార్య భర్తకు చెబుతుందన్న మాట. అయితే, ఈ ఖులా కోసం ప్రైవేటు సంస్థలను ఆశ్రయించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం ద్వారా కూడా ముస్లిం మహిళ భర్త నుంచి విడాకులు పొందొచ్చని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. 

ప్రైవేటు సంస్థలు కోర్టులు కావని, వివాదాలను పరిష్కరించే మధ్యవర్తులు కానీ కావని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాలు గతంలో ఇలాంటి వాటిపై విరుచుకుపడిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. కాబట్టి కుటుంబ న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా చట్టబద్ధంగా విడాకులు పొందొచ్చని పేర్కొంది.  
 
ప్రైవేటు సంస్థలు అందించే ఖులా సర్టిఫికెట్లకు ఇకపై విలువ ఉండదని జస్టిస్ సి.శరవణన్ స్పష్టం చేశారు. ఖులా సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. అందులో భాగంగా 2017లో తమిళనాడులోని తౌహీద్ జామత్ జారీ చేసిన ఖులా సర్టిఫికెట్‌ను కోర్టు రద్దు చేసింది. 

ఇక, తాజా కేసు విషయానికి వస్తే ఈ జంటకు 2013లో వివాహమైంది. 2015లో వీరికి మగబిడ్డ జన్మించాడు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా 2016లో భార్య పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. అనంతరం 2017లో ఖులా సర్టిఫికెట్ తీసుకుంది. దీనిపై అతడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అతడికి అనుకూలంగా తీర్పు చెప్పింది.

More Telugu News