Hanuma Vihari: కెప్టెన్ అంటే ఇలా ఉండాలి.. ఎడమచేయి మణికట్టుకు ఫ్రాక్చర్ అయితే లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేసిన విహారి.. వీడియో వైరల్!

Hanuma Vihari dares wrist fracture to bat lefthanded
  • మధ్యప్రదేశ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఘటన
  • అవేశ్ ఖాన్ బౌలింగులో ఎడమ చేయి మణికట్టుకు ఫ్రాక్చర్
  • రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి చివర్లో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన వైనం
  • మణికట్టును కాపాడుకుంటూనే బ్యాటింగ్
రంజీ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కెప్టెన్ హనుమ విహారి అసమాన పోరాట పటిమ కనబర్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు. మధ్యప్రదేశ్ పేసర్ అవేశ్ ఖాన్ బౌలింగులో విహారి ఎడమ చేయి మణికట్టుకు గాయమైంది. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత చివర్లో మళ్లీ బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటికే అతడి ఎడమ చేయికి ఫ్రాక్చర్ అయినట్టు ఎక్స్‌రే రిపోర్టులో తేలింది. అయినప్పటికీ లెక్క చేయకుండా క్రీజులోకి వచ్చాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన విహారీ.. ఎడమ చేయికి బంతి తగలకుండా ఉండేందుకు లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సమయానికి విహారి 16 పరుగులు చేశాడు. బాధతో మైదానాన్ని వీడిన విహారికి వైద్యులు ఎక్స్‌రే తీయగా మణికట్టు ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. అయితే, జట్టుకు పరుగులు అవసరం అని భావించిన విహారి.. పృథ్వీరాజ్ యర్రా (2) తొమ్మిదో వికెట్‌గా అవుటైన తర్వాత బ్యాట్‌ పట్టి మళ్లీ క్రీజులోకి వచ్చాడు. గాయమైన ఎడమచేతిని రక్షించుకునేందుకు ఈసారి ఎడమ చేత్తో బ్యాటింగ్ చేశాడు.  16 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి విహారి రెండోసారి క్రీజులోకి వచ్చి విలువైన 11 పరుగులు జోడించాడు. ఇందులో రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న అతడు 27 పరుగులు చేశాడు.

ఆంధ్రా వికెట్ కీపర్ రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) సెంచరీలతో విరుచుకుపడడంతో ఆంధ్ర జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసింది. అనంతరం తొలి  ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ నిన్న రెండోరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి 235 పరుగులు వెనకబడి ఉంది. 

గతేడాది వరకు టీమిండియాలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారి ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ రాణిస్తుండడంతో విహారి స్థానం ప్రశ్నార్థకమైంది. ఆస్ట్రేలియతో ఈ నెల 9 నుంచి స్వదేశంలో ప్రారంభం కానున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ విహారికి చోటు దక్కలేదు. కాగా, మణికట్టు ఫ్రాక్చర్ కారణంగా ఆటకు ఆరు వారాలపాటు దూరంగా ఉండాలని వైద్యులు విహారికి సూచించినట్టు తెలుస్తోంది.
Hanuma Vihari
Andhra Cricket Team
Madhya Pradesh
Ranji Trophy

More Telugu News