Bihar: పరీక్షహాల్లోకి వెళ్లి.. చుట్టూ అమ్మాయిలను చూసి స్పృహతప్పి పడిపోయిన ఇంటర్ అబ్బాయి!

  • బీహార్‌లో నిన్న ప్రారంభమైన 12వ తరగతి పరీక్షలు
  • 500 మంది అమ్మాయిల హాలులో అబ్బాయికి సీటు కేటాయింపు
  • వారందరిలో తానొక్కడినే అబ్బాయి కావడంతో కంగారుతో కళ్లు తిరిగిపడిపోయిన విద్యార్థి
  • అధికారుల తీరుపై మండిపడుతున్న అబ్బాయి కుటుంబ సభ్యులు
Male Inter student faints after finding himself among 500 girls in exam centre

పరీక్ష రాసేందుకు హాల్లోకి వెళ్లిన ఇంటర్ విద్యార్థి.. లోపల ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. బీహార్‌లోని నలందా జిల్లాలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనీశ్ శంకర్ ప్రసాద్ అనే 17 ఏళ్ల విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. గణితం పరీక్ష రాసేందుకు నిన్న సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూలుకు వెళ్లాడు. హాల్లోకి వెళ్లగానే లోపల పెద్ద సంఖ్యలో కనిపించిన అమ్మాయిలను చూసి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడ్డాడు. స్కూలు సిబ్బంది వెంటనే అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

ఆ పరీక్షహాల్లో 500 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి మధ్య శంకర్ ప్రసాద్ ఒక్కడే అబ్బాయి కావడంతో కంగారు పడి కుప్పకూలిపోయినట్టు ఆయన తండ్రి సచ్చిదానంద ప్రసాద్ తెలిపారు. విద్యార్థి కిందపడడంతో వెంటనే అప్రమత్తమైన స్కూలు అధికారులు ప్రథమ చికిత్స అనంతరం సదర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కొన్ని గంటల తర్వాత మనీశ్ కోలుకున్నట్టు ఆయన తండ్రి తెలిపారు. 

పూర్తిగా అమ్మాయిల కోసం కేటాయించిన పరీక్ష హాలులో అబ్బాయికి ఎలా సీటు వేస్తారని విద్యార్థి బంధువులు ప్రశ్నిస్తూ బీహార్ ఇంటర్మీడియెట్ కౌన్సిల్‌పై మండిపడుతున్నారు. 500కుపైగా అమ్మాయిలు ఉన్న పరీక్ష హాలులో తన మేనల్లుడికి సీటు కేటాయించడం ముమ్మాటికి అధికారుల తప్పేనని మనీశ్ మేనత్త ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీహార్‌లో నిన్ననే ఇంటర్మీడియెట్ (12వ తరగతి) పరీక్షలు ప్రారంభమయ్యాయి. నలందతోపాటు నవడా, ముంగెర్, బాంకా, దర్భాంగ, సమస్తిపూర్, అరారియా సహా పలు జిల్లాల్లో మాస్ కాపీయింగ్ జరిగినట్టు వార్తలొచ్చాయి. పలు ఎగ్జామినేషన్ సెంటర్లలో విద్యార్థులు యథేచ్ఛగా కాపీయింగ్‌కు పాల్పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Telugu News