నారా లోకేశ్ 6వ రోజు యువగళం పాదయాత్ర.. హైలైట్స్

  • ప్రజలతో మమేకమవుతూ పాదయాత్రను కొనసాగించిన నారా లోకేశ్
  • కొమాసనపల్లిలో మహిళలతో భేటీ
  • రామాపురంలో ముగిసిన ఈనాటి పాదయాత్ర
Nara Lokesh padaya 6th day

టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర 6వ రోజు ముగిసింది. ప్రజల్లో మమేకమవుతూ ఆయన పాదయాత్ర కొనసాగింది. ఉదయం కమ్మనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. బైరెడ్డిపల్లి మండలం సాకేవూరులో చెరుకు రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చెరుకు రైతులు ఆయనను గానుగ వద్దకు తీసుకెళ్లి బెల్లం తయారు చేసే విధానాన్ని వివరించారు. అనంతరం బేలుపల్లిలో భవన నిర్మాణ కార్మికులను పలకరించారు. ఇదే ఊరిలో వాల్మీకి సామాజికవర్గంతో ఆయన సమావేశమయ్యారు. 

ఆ తర్వాత కొమాసనపల్లిలో మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహిళలు తమ బాధలను లోకేశ్ కు చెప్పుకున్నారు. పథకాల కోసం వాలంటీర్ల వద్దకు వెళ్తే అసభ్యంగా మాట్లాడుతున్నారని వారు వాపోయారు. రాబోయే చంద్రన్న ప్రభుత్వంలో మహిళల వంక చూడాలంటేనే భయపడేలా పటిష్టమైన వ్యవస్థను తీసుకొస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

 ఆ తర్వాత నక్కపల్లి గ్రామంలో వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన భూముల రీసర్వే సరిహద్దు రాళ్ళను లోకేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, 'రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే పేరుతో భారీ స్కాం జరుగుతోంది. మీ భూములు జగన్ రెడ్డి కొట్టేస్తున్నాడు. అది భూరక్ష కాదు జగన్ రెడ్డి భూ భక్ష. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం. ప్రజలు కష్ట పడి సంపాదించుకున్న భూమిని డ్రోన్ సర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం దోచుకోవాలని చూస్తుంది. భూమి తగ్గింది అని చెప్పి అధికారుల చుట్టూ తిరగమనడం దారుణం. మేము గెలిచిన వెంటనే జగన్ ప్రజల నుండి దోచుకున్న భూమి తిరిగి ప్రజలకి ఇస్తాం' అని హామీ ఇచ్చారు. రామాపురంలో ఈనాటి ఆయన పాదయాత్ర ముగిసింది. 

More Telugu News