కేంద్ర బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయి: ఏపీ మంత్రి బుగ్గన

  • వార్షిక బడ్జెట్ ప్రకటించిన కేంద్రం
  • పార్లమెంటులో 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • ఆదాయ పన్ను రేట్లు, శ్లాబ్ రేట్లు ఊరటనిచ్చాయన్న బుగ్గన
Buggana opines on union budget

కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. బుగ్గన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయని అన్నారు. ఆదాయ పన్ను రేట్లు, శ్లాబ్ రేట్లు ఊరటనిచ్చాయని తెలిపారు. గతేడాది బడ్జెట్ మూల ధన వ్యయం రూ.7.28 లక్షలు ఉండగా, ఈసారి రూ.10 లక్షలకు పెరిగినట్టు బడ్జెట్ లో చెప్పారని బుగ్గన వివరించారు.

గతేడాది 6.4 శాతం ద్రవ్యలోటు ఉండగా, ఇప్పుడది 5.9 శాతానికి తగ్గినట్టు కనిపిస్తోందని తెలిపారు. ఇది శుభపరిణామం అని అన్నారు. అయితే పలు రంగాల్లో కేటాయింపులు తగ్గినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. యూరియా సబ్సిడీ, వ్యవసాయపరమైన సబ్సిడీలు తగ్గినట్టు కనిపిస్తున్నాయని బుగ్గన వెల్లడించారు. గతేడాది యూరియా సబ్సిడీ రూ.1.54 లక్షల కోట్లు ఉండగా, ఈసారి ఆ సబ్సిడీ రూ.1.31 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలుస్తోందని వివరించారు. 

అదే సమయంలో రైల్వే బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని, గతేడాది రూ.1.89 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2 లక్షల కోట్లకు పైగా కేటాయించారని చెప్పారు. రైల్వే స్టేషన్ల వసతులకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోందని అన్నారు. వ్యవసాయం, పౌరసరఫరాలకు కేటాయింపులు తగ్గినట్టు భావిస్తున్నామని బుగ్గన తెలిపారు. రోడ్లు, రైల్వేల మౌలిక వసతుల కోసం భారీగా కేటాయించినట్టు అర్థమవుతోందని బుగ్గన వెల్లడించారు. 

ప్రతిసారి కేంద్ర బడ్జెట్ ఓ థీమ్ ప్రకారం రూపొందిస్తున్నారని, ఈసారి 7 ప్రధాన అంశాలను ప్రాతిపదికగా చేసుకుని బడ్జెట్ రూపకల్పన చేశారని వివరించారు.

More Telugu News