Andhra Pradesh: ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు బయట పెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. అవమానించిన చోట ఉండనని సంచలన ప్రకటన

  • తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఓ ఐపీఎస్ అధికారి చెప్పారన్న శ్రీధర్ రెడ్డి
  • తన స్నేహితుడితో సంభాషణను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ తనకు పంపించారన్న ఎమ్మెల్యే
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ పడబోనని ప్రకటన
kotamreddy sridhar reddy press meet over phone tapping

ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ లో బయట పెట్టారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయాన్ని తనపై అభిమానం ఉన్న ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని వెల్లడించారు. కానీ, తాను నమ్మలేదన్నారు. సీఎం జగన్ ను ఇంతగా అభిమానించే, అధికారి పార్టీ ఎమ్మెల్యే అయిన తన ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారని అనుకున్నానని చెప్పారు.  తన చిన్ననాటి స్నేహితుడైన ఓ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చిందన్నారు.

 ‘దీనిపై ఒక నంబర్  నుంచి నాకు ఫోన్ వచ్చింది. అది ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు నంబర్. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని నన్ను ఆయన ప్రశ్నించారు. నా స్నేహితుడితో మాట్లాడిన ఆడియోను ఆయన నాకు పంపించారు. ఆధారాలు లేకుండా నేను మాట్లాడను. ఇది ఫోన్ ట్యాపింగ్ కాదా? ఫోన్ ట్యాపింగ్ ఒక్క ఎమ్మెల్యేలతో ఆగదు. మంత్రులు, న్యాయమూర్తులు, ఐపీఎస్ ల ఫోన్లు, విలేకరులు, మీడియా యాజమాన్యాల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు. దీనికి ఎవరైనా ఒప్పుకుంటారా? నేను మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం పట్ల విధేయంగా ఉన్నా. సీఎం జగన్ ను ఎంతగానో అభిమానించా. అవమానాలు ఎదురైనా పార్టీ కోసం కష్టపడ్డా. నన్ను అవమానించిన చోట ఇక ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయను. నాకు నటన చేతకాదు. మోసం చేయడం రాదు. నా ఫోన్ ట్యాపింగ్ చేసి, నా మాటలు దొంగచాటుగా విన్నారని తెలిసినప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ, ఈ రోజు వరకు దాన్ని నా మనసులో  దాచుకున్నా’ అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

More Telugu News