Kantara: అస్కార్ కు 'కాంతార' నామినేట్ కాకపోవడంపై నిర్మాత స్పందన

Vijay Kiragandur explains why Kantara did not make it Oscar nominations
  • ఆస్కార్ రిమైండర్ జాబితాలో కాంతార
  • తుది నామినేషన్లలో చోటు దక్కించుకోలేకపోయిన వైనం
  • ప్రమోషన్ లోపం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్న విజయ్ కిరగందూర్
చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన కన్నడ చిత్రం కాంతార. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేయడం విశేషం. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో కాంతార చిత్రాన్ని తెరకెక్కించారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషించగా, సప్తమి గౌడ కథానాయిక. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

కాగా, ఈ సినిమా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో రిమైండర్ జాబితాలో చోటుచేసుకున్నప్పటికీ, తుది నామినేషన్ల జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయింది. దీనిపై నిర్మాత విజయ్ కిరగందూర్ స్పందించారు. 

కాంతార చిత్రానికి ఆస్కార్ దిశగా తగిన విధంగా ప్రచారం కల్పించలేకపోయామని వెల్లడించారు. అంతర్జాతీయస్థాయిలో ప్రమోషన్ లోపం వల్లే కాంతార ఆస్కార్ బరిలో వెనుకబడిపోయిందని అభిప్రాయపడ్డారు. కాంతార చిత్రం సెప్టెంబరులో రిలీజ్ కావడంతో, ఆస్కార్ ప్రమోషన్లకు తగినంత సమయం లభించలేదని అన్నారు. 

కాంతార-2 చిత్రానికి ఆ పరిస్థితి రానివ్వబోమని, ఆస్కార్ అవార్డు కానీ, కనీసం గోల్డెన్ గ్లోబ్ అవార్డయినా వచ్చేలా కృషి చేస్తామని వివరించారు. అయితే, భారతీయ మూలాలు ప్రపంచానికి తెలిశాయంటే అది కాంతార, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల వల్లేనని విజయ్ కిరగందూర్ పేర్కొన్నారు.
Kantara
Oscar
Nominations
Vijay Kiragandur

More Telugu News