సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోటంరెడ్డికి బాలినేని సలహా

  • ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన కోటంరెడ్డి
  • సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తి
  • ట్యాపింగ్ పై ముందే ఎందుకు చెప్పలేదన్న బాలినేని
  • కోటంరెడ్డి అపోహపడుతుండొచ్చని వ్యాఖ్యలు
  • సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ జరగదన్న కాకాణి
Balineni advises Kotamreddy

తన ఫోన్ ను ట్రాప్ చేస్తున్నారంటూ సొంత పార్టీపైనే తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. సమస్య ఏదైనా ఉంటే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. 

ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది నిజమే అయితే ఆ విషయాన్ని కోటంరెడ్డి ఎందుకు ప్రభుత్వానికి ముందే చెప్పలేదు? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి పొరబడుతుండొచ్చని అన్నారు. ముందు, ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందో, లేదో నిర్ధారణ చేసుకోవాలని బాలినేని హితవు పలికారు. ఏ నేతకైనా తాము ఒకటే చెబుతామని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. 

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. ఇలాంటివన్నీ టీకప్పులో తుపాను వంటి వ్యవహారాలని కొట్టిపారేశారు. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ జరగదని, కోటంరెడ్డి పార్టీ కోసం పనిచేసే వ్యక్తి అని అన్నారు.

More Telugu News