KTR: బండి సంజయ్, ఈటలపై ఓ రేంజిలో నిప్పులు చెరిగిన కేటీఆర్

  • జమ్మికుంటలో బహిరంగ సభ
  • హుజూరాబాద్ కు ఈటలను పరిచయం చేసింది కేసీఆరేనన్న కేటీఆర్
  • తండ్రిలాంటి కేసీఆర్ ను విమర్శిస్తున్నాడని ఆగ్రహం
  • మోదీ దేవుడు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించడంపైనా ఫైర్
KTR fires on Bandi Sanjay and Eatala

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ధ్వజమెత్తారు. హుజూరాబాద్ కు ఈటలను పరిచయం చేసింది కేసీఆరేనని, తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. 

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నాడని అన్నారు. ఎవరి పాలన దేశానికి అరిష్టదాయకమో ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారు... ఆ రూ.15 లక్షలు ఎవరి ఖాతాలో పడ్డాయి? అని కేటీఆర్ నిలదీశారు. 

ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పైనా కేటీఆర్ ధ్వజమెత్తారు. "ఢిల్లీలో 700 మంది రైతులను ఎండలో, వానలో, చలిలో కాల్చుకుతిన్నారు... రైతులు చనిపోయినా కానీ కనికరించని వ్యక్తి నరేంద్ర మోదీ. మోదీ ఎవరికి దేవుడు? ఏం చేశాడు నరేంద్ర మోదీ? 30 ఏళ్లలోనే అత్యధిక ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయాయి. మునుపెన్నడూ లేనంతగా పెట్రోల్, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. రూపాయి పాతాళానికి పడిపోతే, అప్పులు ఆకాశాన్నంటుతున్నాయి. ఇందుకేనా నరేంద్ర మోదీ దేవుడు? 

ఇంకా ఆయన అంటాడు... అమిత్ షాను చూస్తే టచ్ చేయబుద్ధవుతుందట! ఇదేం దిక్కుమాలిన టచ్ నాకు అర్థం కాదు. ఇందుకా నిన్ను ఎంపీని చేసింది? ఎంత చిల్లర మాటలు! తెల్లారిలేచింది మొదలు... మైక్ దొరికితే చాలు... మసీదులు తవ్వుదాం... శవం వెళితే మీది శివం వెళితే మాది అంటాడు... ఇందుకా నిన్ను ఎంపీని చేసింది. 

తవ్వుదాం రా... హుజూరాబాద్ లో కాలువల కోసం పునాదులు తవ్వుదాం రా. దమ్ముంటే రా.... హుజూరాబాద్ లో కొత్త పరిశ్రమలు పెట్టేందుకు పునాదులు తవ్వుదాం! హుజూరాబాద్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పునాదులు తవ్వుదాం... దమ్ముంటే మోదీని ఒప్పించి నాలుగు పైసలు తీసుకురా!

ఇవేవీ చేతకావు కానీ... గట్టిగా మాట్లాడితే మెమ్మెమ్మె... బెబ్బెబ్బె.. హిందూస్థాన్ పాకిస్థాన్... హిందూ ముస్లిం అంటాడు. బండి సంజయ్ గారూ... ఈ నాలుగున్నరేళ్లలో ఎంపీగా మీరు, ఈ 14 నెలల కాలంలో ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ కు ఏంచేశారో చెప్పే దమ్ముందా?

తెల్లారిలేస్తే సొల్లుమాటలు చెబుతూ కేసీఆర్ ను తిట్టడంకాదు... చేతనైతే హుజూరాబాద్ కు మెడికల్ కాలేజీ తీసుకురా, చేతనైతే నవోదయ పాఠశాల తీసుకురా, చేతనైతే కరీంనగర్ కు ఓ ట్రిపుల్ ఐటీ తీసుకురా! ఇవి తీసుకువస్తే నీకు సన్మానం చేస్తాం. ఇవేవీ చేతకావు కానీ మతం పేరిట చిచ్చుపెట్టడంలో మాత్రం సిద్ధహస్తులు" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

"పెద్దలు చెబుతారు... వెట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలంటారు. ఇవాళ తెలంగాణలో మన పార్టీ అంటే ఒకే ఒక్క భారత రాష్ట్ర సమితి మాత్రమే తప్ప ఈ గుజరాతోళ్ల బీజేపీ కానే కాదు. ఈ గుజరాత్ వాళ్లకు గులాంగిరీ చేయడం బండి సంజయ్ కు ఇష్టమేమో, ఈ గుజరాత్ వాళ్ల చెప్పులు నెత్తిమీద పెట్టుకునే అలవాటు ఆయనకు ఉండొచ్చు. కానీ వాళ్లకు గులాంగిరీ చేసే అవసరం మాకు లేదు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 

కాగా, జమ్మికుంట సభకు ఓ యువకుడు బీజేపీ టీషర్టు ధరించి రాగా, బీఆర్ఎస్ కార్యకర్తలు అతడిని పట్టుకుని చితకబాదారు. పోలీసులు జోక్యం చేసుకుని, ఆ యువకుడ్ని సభ నుంచి పంపించివేశారు.

More Telugu News