kids: పిల్లలకు ఎక్కువ సమయం పాటు ఫోన్ ఇస్తున్నారా...? జాగ్రత్త మరి!

  • టెక్ నెక్ సిండ్రోమ్ ప్రమాదం ఉందంటున్న వైద్యులు
  • ఈ సమస్యతో వచ్చే రోగుల్లో చిన్నారులూ ఉంటున్న వైనం
  • సరైన రీతిలో మెడను ఉంచకపోతే సమస్య తీవ్రతరమవుతుందని హెచ్చరిక
Long hours on smartphones leaving kids with tech neck

నేడు చిన్నారులకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్లు రాకముందు వరకు పిల్లలు చదువు తర్వాత ఖాళీ సమయంలో ఎన్నో రకాల ఆటలు ఆడుకునేవారు. ఆటలు శారీరక ఎదుగుదలకు ఉపయోగపడేవి. కానీ, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లను పిల్లలకు ఇవ్వడం వల్ల ఉపయోగం లేకపోగా, ఎన్నో అనర్థాలను చిన్న వయసులోనే తెచ్చినట్టు అవుతోంది. న్యూయార్క్ కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రిచర్డ్ వెస్ట్రీచ్ ఇటీవలే ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు.

న్యూ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ (టెక్ నెక్) గురించి ఆయన వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ ను ఎక్కువ సమయం పాటు చిన్నారులు వినియోగిస్తే వారి చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపు వస్తాయని తెలిపారు. మెడ నొప్పి, తలనొప్పి, భుజం నొప్పి కూడా వస్తాయని హెచ్చరించారు. టెక్ నెక్ సాధారణంగా కనిపించే సమస్యగా భారత వైద్యులు కూడా చెబుతున్నారు. ‘‘నేను రోజూ చూసే రోగుల్లో 20 శాతం మంది టెక్ నెక్ సిండ్రోమ్ సమస్యతో వచ్చే వారు అయితే, అందులో ఎక్కువ మంది పిల్లలే ఉంటున్నారు’’ అని ఢిల్లీలోని ఆకాశ్ హెల్త్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ డాక్టర్ ఆశిష్ చౌదరి వెల్లడించారు. 

‘‘ఆన్ లైన్ క్లాసెస్ కోసం ల్యాప్ టాప్ పై ఎక్కువ సమయం వెచ్చించడం, శారీరక క్రియలు లోపించడం, సూర్యరశ్మి తగినంత లేక విటమిన్ డీ లోపం, చెడు ఆహార అలవాట్లు టెక్ నెక్ సమస్యకు కారణాల్లో కొన్ని. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే గతంలో టెక్ నెక్ సిండ్రోమ్ తో మధ్య వయసు వారు ఎక్కువగా వచ్చే వారు. కానీ, ఇప్పుడు టీనేజర్లు, స్కూల్ కు వెళ్లే పిల్లలు ఎక్కువగా వైద్య సలహా కోసం వస్తున్నారు’’ అని డాక్టర్ చౌదరి పరిస్థితి తీవ్రతను వివరించారు.

‘‘ల్యాప్ టాప్ పై పనిచేయడం, లేదా మొబైల్ లో టెక్ట్సింగ్ ఎక్కువ సమయం పాటు చేయడం వల్ల మెడ జాయింట్, లిగమెంట్లు, కండరాలపై ఎంతో ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా సరైన విధంగా లేని భంగిమతో నష్టం జరుగుతుంది. అది మెడ నొప్పికి దారితీస్తుంది. మెడ జాయింట్ వద్ద ఇన్ ఫ్లమేషన్ కు కారణమవుతుంది. అక్కడి నుంచి నొప్పి తలకు వ్యాపిస్తుంది. దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన నొప్పిగా మారుతుంది’’ అని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ చాబ్రా తెలిపారు.

తలను ముందుకు వంచడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకని చిన్నారులకు ఫోన్ ఇవ్వకుండా ఉండడమే మంచిది. కావాలంటే కొంత సమయం టీవీ చూడనివ్వొచ్చు. ఎందుకంటే టీవీ అనేది మన కంటి చూపునకు సరిపడే ఎత్తులోనే ఉంటుంది. పైగా ఏ స్క్రీన్ ను ఉపయోగిస్తున్నా భంగిమ సరిగ్గా ఉండేలా చూసుకోవడం అవసరం.

More Telugu News