రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. సర్జరీ సక్సెస్

  • ఈ వారంలోనే విడుదల కానున్న రిషబ్ పంత్
  • మార్చిలో మరో విడత మోకాలి లిగమెంట్లకు సంబంధించి సర్జరీ
  • పూర్తిగా కోలుకునేందుకు 9 నెలలు పట్టొచ్చన్న బీసీసీఐ అధికారి
Rishabh Pant latest health updates Good news for India star check details inside

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మోకాలి లిగమెంట్ కు శస్త్రచికిత్స చేయించుకున్న ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ పరిస్థితి మెరుగు పడుతోంది. ఈ వారంలోనే ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారు. డిసెంబర్ 30న పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొనడం తెలిసిందే. మొదట డెహ్రాడూన్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతడు చికిత్స పొందగా, మెరుగైన చికిత్స కోసం అతడ్ని ముంబైలోని ధీరూబాయి కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. 

కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు పంత్ మోకాలికి సర్జరీ చేశారు. ‘‘అతడు బాగా కోలుకుంటున్నాడు. వైద్య బృందం నుంచి ఈ వార్త వచ్చింది. మొదటి సర్జరీ విజయవంతమైంది. అందరూ ఇదే తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ వారంలోనే అతడు డిశ్చార్జ్ కానున్నాడు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక పంత్ మోకాలి లిగమెంట్లకు సంబంధించి వైద్యులు మార్చిలో మరో సర్జరీ చేయనున్నారు. రోడ్డు ప్రమాదంలో పంత్ కుడి మోకాలిలో మూడు లిగమెంట్లు తెగిపోయాయి. సర్జరీ ద్వారా వాటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురానున్నారు. 

‘‘బీసీసీఐ వైద్య బృందం కోకిలాబెన్ ఆసుపత్రి, డాక్టర్ పార్ధివాలాతో సంప్రదింపులు నిర్వహిస్తారు. మార్చిలో మరో సర్జరీ అవసరం కావచ్చు. అది ఎప్పుడు నిర్వహించాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. త్వరలోనే అతడు పూర్తి రికవరీతో మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాం’’ అని సదరు అధికారి తెలిపారు. ఎంత లేదన్నా పంత్ తిరిగి మైదానంలోకి వచ్చేందుకు 8-9 నెలలు పట్టొచ్చన్నారు. అతడి రికవరీపైనే తమ దృష్టంతా ఉన్నట్టు చెప్పారు.

More Telugu News