అండర్ 19 మహిళల ప్రపంచకప్ విజేతలకు సచిన్ చేతుల మీదుగా సత్కారం

  • రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సత్కారం
  • మూడో టీ20 మ్యాచ్ కు ముందు సత్కార కార్యక్రమం
  • ప్రపంచకప్ విజేతలను సత్కరించనుండటం సంతోషంగా ఉందన్న జైషా
Sachin Tendulkar to facilitate India U19 team for world cup victory

మొట్టమొదటి సారి నిర్వహించిన అండర్ 19 మహిళల ప్రపంచకప్ ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్స్ లో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసి మన అమ్మాయిలు ప్రపంచ విజేతలుగా నిలిచారు. భారత్ కు ప్రపంచకప్ ను తెచ్చిన యువ మహిళా ప్లేయర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. వరల్డ్ కప్ ను గెలుపొందిన జట్టు సభ్యులకు, సహాయక సిబ్బందికి బీసీసీఐ రూ. 5 కోట్లను నజరానాగా ప్రకటించింది. మరోవైపు జట్టు సభ్యులను ప్రత్యేకంగా సత్కరించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ లో మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు ప్రపంచకప్ విజేతలను బీసీసీఐ సత్కరించనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ చేతుల మీదుగా ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందిస్తూ... భారత్ ను ప్రపంచ విజేతగా నిలిపిన అండర్ 19 మహిళా జట్టు సభ్యులకు సచిన్ టెండూల్కర్, బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ సమక్షంలో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రేపు సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. యువ క్రికెట్లర్లు మన దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు.

More Telugu News