Pakistan: పాక్ మసీదులో ఉగ్రదాడి ఘటనలో 83కు పెరిగిన మృతుల సంఖ్య

  • పెషావర్ లోని మసీదులో సోమవారం మధ్యాహ్నం దాడి
  • పేలుడు ధాటికి కూలిన మసీదు గోడ 
  • శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతదేహాలు
83 Killed In Suicide Bomb Attack At Mosque In Pakistan

పెషావర్ లోని మసీదులో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడి ఘటనలో మృతుల సంఖ్య 83 కు పెరిగిందని పాకిస్థాన్ అధికారులు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రార్థన సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో భారీ విస్పోటనం జరిగింది. మసీదు గోడ కూలిపోయింది. ఈ దాడిలో 83 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 

మరో 150 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. పేలుడు ధాటికి మసీదు గోడలో కొంతభాగం కూలిపోయింది. ఆ శిథిలాల కింద చిక్కుకుని చాలామంది చనిపోయారు. పేలుడు తర్వాత అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయని తెలిపారు.

మంగళవారం ఉదయం కూడా సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ పేలుడుకు పాల్పడింది తమ ఆత్మాహుతి దళ సభ్యుడేనని తెహ్రీక్-ఐ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) సంస్థ సోమవారం ప్రకటించుకుంది. సిటీలోని పోలీస్ కార్యాలయం ఆవరణలో అత్యంత భద్రత ఉండే చోట పేలుడు జరగడంపై అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

More Telugu News