ఫ్లోరిడాలో దుండగుల కాల్పులు.. పదిమందికి గాయాలు!

  • కారులో వచ్చి కిటికీ అద్దాలు దించి కాల్పులు
  • గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమం
  • మాంటెరీ పార్కులో ఇటీవల జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి
10 injured in latest mass shooting in Florida

అమెరికాలో తుపాకుల మోత కొనసాగుతోంది. గతవారం లాస్ ఏంజెలెస్ సమీపంలోని మాంటెరీ పార్కు నగరంలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలపై జరిగిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడ్డారు. ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. తాజాగా, ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని లేక్‌ల్యాండ్ పోలీసు విభాగం నిర్ధారించింది. సోమవారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయని, కనీసం 10 మంది గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు.  

డార్క్ బ్లూ కలర్ నిస్సాన్ కారులో వచ్చిన నలుగురు దుండగులు కిటికీ అద్దాలను దించి వాహనాన్ని నెమ్మదిగా పోనిస్తూ కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కారులో నుంచే వారు కాల్పులకు పాల్పడ్డారని, నిందితులందరూ పురుషులేనని పేర్కొన్నారు. గాయపడిన వారిలో ముగ్గురిని మాత్రమే అత్యవసర చికిత్సకు తరలించినట్టు తెలిపారు. వారి వయసు 20 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుందని పేర్కొన్నారు. ముఖాలు కనిపించకుండా కప్పుకుని కాల్పులకు దిగిన దుండగుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News