Governor: బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

  • ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • గవర్నర్ ప్రసంగం ఉండదంటూ ప్రచారం
  • గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలుపలేదన్న సర్కారు
  • హైకోర్టులో పిటిషన్.. కోర్టు సూచనతో ఇరువర్గాల మధ్య సయోధ్య
Minister Vemula Prashant Reddy invites Governor to budget sessions inaugural speach

ఫిబ్రవరి 3న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్ భవన్ కు వెళ్లి.. గవర్నర్ ను కలిసి బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ ఆమెను లాంఛనంగా ఆహ్వానించారు. 

గత కొంతకాలంగా, బీఆర్ఎస్ నేతలకు, గవర్నర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోన్న తరుణంలో, ఈ ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. అటు, గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలుపలేదంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. న్యాయస్థానం సూచనతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. రాజ్యాంగబద్ధంగా ముందుకెళతామని, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. 

ఈ సందర్భంగా... గవర్నర్ పై బీఆర్ఎస్ మంత్రులు, ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలను గవర్నర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ పై వ్యాఖ్యలు సరికాదని నేతలకు చెబుతామని ప్రభుత్వ తరఫు న్యాయవాది హామీ ఇచ్చారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తాను దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంది.

More Telugu News