పలమనేరు నియోజకవర్గంలో ప్రవేశించిన నారా లోకేశ్ పాదయాత్ర... ఈరోజు ముఖ్యాంశాలు

  • లోకేశ్ పాదయాత్రకు నేడు నాలుగో రోజు
  • అన్నవరం వద్ద పలమనేరు నియోజకవర్గంలో ప్రవేశించిన యాత్ర
  • హారతి ఇచ్చి స్వాగతం పలికిన మహిళలు
  • వివిధ వర్గాల వారితో లోకేశ్ సమావేశం
Nara Lokesh padayatra enters into Palamaneru constituency

ఈ నెల 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారభించిన సంగతి తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర నేడు పలమనేరు నియోజకవర్గంలో ప్రవేశించింది. వి.కోట మండలం అన్నవరం వద్ద పలమనేరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించగానే.... మహిళలు ఎదురేగి లోకేశ్ కు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. టీడీపీ శ్రేణులు లోకేశ్ పై పూలవర్షం కురిపించారు. గజమాలలతో టీడీపీ యువనేతకు నీరాజనాలు పలికారు.

యువగళం పాదయాత్ర ముఖ్యాంశాలు...

పాదయాత్ర సందర్భంగా దారిలో పలువురు వృద్ధ మహిళలను లోకేశ్ అక్కున చేర్చుకుని వారి యోగక్షేమాలు అడిగారు. 

పడిగల కుప్పం వద్ద మల్బరీ రైతులు లోకేశ్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. లోకేశ్ కు వారు వినతిపత్రం అందజేశారు. టీడీపీ ప్రభుత్వం మల్బరీ రైతులకు ఇచ్చిన సబ్సిడీలను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిందని వాపోయారు.

పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం కొంగటం పంచాయతీ కోరుకుంటలో రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు లోకేశ్ ను కలిశారు. రెడ్డి కార్పొరేషన్ కు నిధులు కేటాయించి రెడ్డి సామాజిక వర్గంలోని పేదలను ఆదుకోవాల్సి ఉందన్నారు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్నా తమకు ప్రభుత్వ పథకాలు వర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, యువగళం కర్ణాటక సరిహద్దుల్లోని పంతాన్ హళ్లి చేరుకోగానే, కర్ణాటక వాసులు లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. లోకేశ్ పాదయాత్రకు కర్ణాటక పోలీసులు భారీ భద్రత కల్పించారు. కాగా, పంతాన్ పల్లిలో లోకేశ్ స్వయంగా తమ కాన్వాయ్ వాహనాలకు డీజిల్ కొట్టించారు. ఆపై తానే డబ్బులు చెల్లించారు. కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలకు, ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యత్యాసం తెలుసుకున్నారు. 

ఇక్కడి ధరలు చూశాక ఏపీలో జగన్ బాదుడు ఎంత దారుణంగా ఉందో తెలుస్తోందన్నారు. కర్ణాటకలో డీజిల్ లీటర్ రూ.88, పెట్రోల్ లీటర్ రూ.102 అని... అదే ఏపీలో లీటర్ డీజిల్ రూ.99.27 అని, లీటర్ పెట్రోల్ రూ.111.50 అని లోకేశ్ వివరించారు.

వి.కోట మండలం గాంధారమాకులపల్లిలో వడ్డెర సామాజికవర్గం నేతలతో లోకేశ్ సమావేశమయ్యారు. వడ్డెరల సమస్యలపై చంద్రబాబు 2018లో సత్యపాల్ కమిటీ వేశారని గుర్తుచేశారు. సత్యపాల్ కమిటీ నివేదికను జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టిందో చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వడ్డెరల్లో పేదరికం అధికంగా ఉందని అన్నారు. జగన్ పాలనలో వడ్డెర కార్పొరేషన్ నుంచి సంక్షేమ పథకాలు శూన్యమని తెలిపారు.

పెద్దిరెడ్డి కబంధ హస్తాల్లో చిక్కుకున్న మైనింగ్ ను స్వాధీనం చేసుకుని వడ్డెర్లకు ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

కాగా, తమను ఎస్టీల్లో చేర్చాలని వడ్డెరలు లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి గుర్తింపు లేదని, గ్రామంలో 90 శాతం మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొందని వివరించారు. 

వి.కోటలోని జీఎంఆర్ కల్యాణమండపంలో లోకేశ్ యువతతో సమావేశమయ్యారు. యువత పోరాటానికి మద్దతుగా నిలిచేందుకే యువగళం కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు లోకేశ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని లోకేశ్ ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పన చేయలేక, ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంచుకుంటూ పోతున్నాడని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాడని, సిగ్గనిపించడంలేదా అని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా తెస్తాం అని చెప్పిన జగన్... ఢిల్లీ వెళ్లి పెద్దల కాళ్లు మొక్కడం తప్ప నోరెత్తడంలేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతోనూ జగన్ యువతను మోసం చేస్తున్నాడని లోకేశ్ ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.

దావోస్ పర్యటనకు వెళ్లి పరిశ్రమలు తీసుకురాలేని దద్దమ్మ సీఎం, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ఈ రాష్ట్రానికి అవసరమా అని లోకేశ్ ప్రశ్నించారు. చలి ఎక్కువగా ఉందని దావోస్ వెళ్లడంలేదని మంత్రి చెప్పడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.

బాబాయ్ హత్య కేసులో అవినాష్ ను కాపాడేందుకే జగన్ ఢిల్లీ వెళుతున్నాడని, కానీ పరిశ్రమలు తెచ్చేందుకు వెళుతున్నానని కలరింగ్ ఇస్తున్నాడని విమర్శించారు.

More Telugu News