మసాలా సరిపోలేదు... కేటీఆర్ పై ధ్వజమెత్తిన బీజేపీ ఎంపీ అరవింద్

  • కేటీఆర్ ఇందూరుకు ఎందుకు వచ్చినట్టని ప్రశ్నించిన అరవింద్
  • కేటీఆర్ రాజీనామా చేస్తే ఇందూరు ప్రజలకు సంతోషమని వెల్లడి
  • కేటీఆర్ చిత్తశుద్ధి ఎంతో తెలిసిందంటూ వ్యాఖ్యలు
BJP MP Arvind taka a jibe at KTR

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. కేంద్రానికి తెలంగాణ నుంచి రూ.3.68 లక్షల కోట్లు ఇచ్చామని, కానీ కేంద్రం నుంచి తెలంగాణకు అందింది తక్కువేనని కేటీఆర్ అంటున్నారని అరవింద్ వెల్లడించారు. లేకపోతే రాజీనామా చేస్తానని కేటీఆర్ అన్నారని, ఆయన ఆ మాట అనగానే ఇందూరు ప్రజలంతా చప్పట్లు కొట్టారని తెలిపారు. 

ఆయన చెల్లిని ఓడించిన ఇందూరు ప్రజలు ఆమె రాజకీయ జీవితాన్ని ఖతం చేశారని, ఇప్పుడు ఆయన రాజీనామా అనగానే ఇందూరు ప్రజలకు మరింత సంతోషం కలిగిందని అరవింద్ వ్యాఖ్యానించారు. 

ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత... మీడియా మిత్రులను ఉద్దేశించి, మసాలా సరిపోయిందా? అని కేటీఆర్ అంటున్నాడని తెలిపారు. ఇందూరు ప్రజలపైనా, జిల్లాలో ప్రజలపైనా వీరికున్న చిత్తశుద్ధి ఇదీ... అంటూ ధర్మపురి అరవింద్ విమర్శనాస్త్రాలు సంధించారు. 

"మసాలా సరిపోయిందా అంట... సరిపోలేదు మసాలా... నేను చెబుతా విను. ఈయనకు తిలక్ గార్డెన్ గుర్తొచ్చిందంట. ఈ కుటుంబానికి వచ్చిన రోగమేంటో గానీ, వీళ్లు ఎంతసేపు ఫాంహౌస్, గార్డెన్, బాలీవుడ్ గురించి మాట్లాడుతుంటారు. ఇవి తప్ప వీళ్లింకేం మాట్లాడరు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ,చెరుకు రైతులు ఇలాంటివి గుర్తుకురావా? అసలు ఇందూరుకు కేటీఆర్ ఎందుకు వచ్చినట్టు?" అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో కమీషన్లు తిన్నారు కాబట్టే డీపీఆర్ ఇవ్వలేదని అరవింద్ ఆరోపించారు.

More Telugu News