ఎలాన్ మస్క్ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారట!

  • 5 కంపెనీలకు అధిపతిగా వాటి నిర్వహణ కోసం పగలు, రాత్రి మస్క్ కష్టపడుతున్నారట
  • నష్టాల్లో ఉన్న ట్విట్టర్ ను లాభదాయకమైన సంస్థగా మారుస్తానని గతంలో ప్రకటన
  • ఇందుకోసం రోజుకు 18 గంటలపాటు పని చేస్తున్నట్లు వెల్లడి 
Elon Musk is having sleepless nights working all day

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్.. ప్రస్తుతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. 5 కంపెనీలకు అధిపతిగా ఉన్న మస్క్.. వాటి నిర్వహణ కోసం పగలు, రాత్రి కష్టపడుతున్నారట. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో ట్విట్టర్ లో పంచుకున్నారు. రోజంతా పని చేస్తున్నానని, తర్వాత ఇంటికి వెళ్లి వర్క్ సిములేటర్ ఆడుతున్నానని చెప్పారు. ట్విట్టర్ కోసం రోజుకు 18 గంటలపాటు పని చేస్తున్నట్లు గతంలో ఓ సారి వెల్లడించారు. 

స్పేస్ ఎక్స్, టెస్లా, ది బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ తో పాటు ట్విట్టర్ కు మస్క్ యజమాని. గతేడాది ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఆయన.. అప్పటి నుంచి ఆ కంపెనీపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.  ప్రస్తుతం నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లాభదాయకమైన సంస్థగా ‘ట్విట్టర్ 2.0’ను తయారు చేస్తానని ఇటీవల మస్క్ ప్రకటించారు.  

ట్విట్టర్ ఖర్చును తగ్గించుకునే చర్యల్లో భాగంగా దాదాపు 50 శాతం ఉద్యోగులను తొలగించారు. ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా ఇంటికి పంపేశారు. మస్క్ తీరుతో కొందరు స్వచ్ఛందంగా జాబ్స్ వదులుకున్నారు. భారతదేశంలో సుమారు 170 మందిని ట్విట్టర్ తొలగించగా.. ప్రస్తుతం 80 మంది దాకా పని చేస్తున్నారు.

మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ కు 2,300 దాకా ఉద్యోగులు ఉన్నట్లు ఇటీవల మస్క్ ప్రకటించారు. సంస్థను పునర్నిర్మించేందుకు మస్క్ రోజంతా పని చేస్తున్నారు. ఉద్యోగులతోనూ అలానే పని చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఆఫీసులో బెడ్ రూమ్స్ ను ఏర్పాటు చేసిన ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఉద్యోగులు మరింత ఎక్కువ సమయం ఆఫీసులో ఉండేందుకు, పని చేసేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఆఫీసు ఫర్నిచర్, కిచెన్ వస్తువులను అమ్మేస్తున్నారు. ఆఖరికి అమెరికాలోని ఆఫీసును క్లీన్ చేసే వాళ్లను కూడా తొలగించారు.

More Telugu News