Junior NTR: ఎన్టీఆర్​–కొరటాల చిత్రం కోసం హైదరాబాద్​లో సముద్రం సెట్

NTR30 sets construction in full flow
  • సాబు సిరిల్ సమక్షంలో శర వేగంగా పనులు 
  • శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేయనున్న ఎన్టీఆర్
  • ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో తారక్ నటన మెచ్చి హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆర్ఆర్ఆర్ విడుదలై ఏడాది కావస్తున్నా ఎన్టీఆర్ తర్వాతి చిత్రం ఇంకా మొదలవ్వలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తదుపరి చిత్రం ఉంది. ఇది తారక్ కెరీర్ లో 30వ సినిమా. షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుపెట్టనున్నట్టు చిత్ర బృందం నుంచి స్పష్టత వచ్చింది. సముద్రపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లో భారీ సముద్రం సెట్ని వేయిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆ పనిలోనే ఉన్నారు. 

ఆర్ఆర్ఆర్ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక సినిమాలకు పనిచేసిన సిరిల్.. సహజత్వం ఉట్టిపడేలా నగరంలో సముద్రపు సెట్ వేస్తున్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట తన పుట్టిన రోజును కూడా సాబు ఈ సెట్ లోనే జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫిబ్రవరి రెండో వారంలో చిత్రం షూటింగ్ ను ఘనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌తో పాటు రాజమౌళి కుటుంబం, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ఆహ్వానిస్తారని సమాచారం. కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
Junior NTR
Koratala Siva
Hyderabad
ocean set

More Telugu News