పాదయాత్రలో చంటిబిడ్డకు నామకరణం చేసిన లోకేశ్

  • రెండో రోజు ముగిసిన లోకేశ్ పాదయాత్ర
  • వివిధ వర్గాలతో మాట్లాడిన లోకేశ్
  • వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం
  • అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ
Nara Lokesh second day Yuvagalam Padayatra highlights

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండోరోజు ముగిసింది. ఇవాళ్టి పాదయాత్రలో లోకేశ్ వివిధ వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

కాగా, కుప్పం మండలం వడ్డిపల్లి గ్రామానికి చెందిన మద్దేటి రిషికేశ్, అశ్వని దంపతుల చంటిబిడ్డకు లోకేశ్ నామకరణం చేశారు. ఈ దంపతులకు లోకేశ్ అంటే ఎంతో అభిమానం. దాంతో వారు లోకేశ్ ను కలిసేందుకు ఆయన బస చేసి పీఈఎస్ వైద్య కళాశాల వద్దకు వచ్చారు. లోకేశ్ ను కలిసి తమ 3 నెలల పసికందును ఆయనకు అందించి పేరు పెట్టాలని కోరారు. ఆ పసిబిడ్డను ముద్దాడిన లోకేశ్ సాన్విత అని నామకరణం చేశారు. తద్వారా ఆ పాప తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం నింపారు. 

ఇక, కుప్పం శివారు ప్రాంతంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీ సమీపంలో వాల్మీకి, కురుబ కమ్యూనిటీ భవనాల నిర్మాణం నిలిచిపోవడాన్ని లోకేశ్ గమనించారు. వాల్మీకి, కురుబ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు ఆపేయడం దుర్మార్గమని, చంద్రబాబుపై కోపాన్ని బీసీలపై చూపిస్తారా? అని వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లోనే కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పూర్తిచేస్తామని ఆయా వర్గాల నేతలకు లోకేశ్ హామీ ఇచ్చారు. 

పాదయాత్ర సందర్భంగా లోకేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ధ్వజమెత్తారు. కుప్పంలో జరుగుతున్న అరాచకాలకు పెద్దిరెడ్డే కారణమని ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని, భయమనేది తన బయోడేటాలో లేదని, మర్డర్ సహా తనపై అన్ని కేసులూ పెట్టారని, ఏం చేయగలిగారని లోకేశ్ ప్రశ్నించారు. 

గణేశ్ క్రాస్ వద్ద రాజమ్మ, మునిరత్నం అనే టమోటా రైతు కుటుంబంతో లోకేశ్ మాట్లాడారు. టమోటా పంటపై రూ.50 వేలు పెట్టుబడి పెట్టామని, గిట్టుబాటు ధర లేక నష్టాలు ఎదుర్కొన్నామని, ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారని రాజమ్మ, మునిరత్న ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక గుడిపల్లి మండలం పొగురుపల్లి పంచాయతీకి చెందిన పూజ అనే బయోటెక్ విద్యార్థినితోనూ లోకేశ్ మాట్లాడారు. బయోటెక్నాలజీ చదివినా ప్లేస్ మెంట్ లో ఉద్యోగం రాలేదని పూజ వెల్లడించింది. ఇంటర్న్ షిప్ కూడా చేశానని, కానీ ప్లేస్ మెంట్ చూపించలేదని, ఆర్బీకేలో ఉద్యోగం చేసుకోండి అంటున్నారని వివరించింది. ఎంతో వ్యయప్రయాసలతో చదువుకుని ఖాళీగా కూర్చోవాల్సి వస్తోందని పూజ విచారం వ్యక్తం చేసింది. 

అబ్దుల్ అనే ఫిజియోథెరపీ విద్యార్థి స్పందిస్తూ, చాలీచాలని ఫీజు రీయింబర్స్ మెంట్ తో చదువుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని లోకేశ్ ఎదుట వాపోయాడు. పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంటు అమలు జరగడంలేదని అన్నాడు. అటు, కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా లోకేశ్ ను కలిశారు. విద్యా దీవెన, వసతి దీవెన అంటున్నారే తప్ప తమకు డబ్బులు రావడంలేదని వారు తెలిపారు. 

పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ బీసీలతోనూ సమావేశమయ్యారు. అధికారంలోకి వస్తే వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతానని మాటిచ్చిన జగన్ మాట తప్పి మడమ తిప్పాడని ఆరోపించారు. వడ్డెర్లు క్వారీలు తవ్వుకునే అవకాశాన్ని చంద్రబాబు ఇచ్చారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చాక వడ్డెర్ల పొట్టకొట్టారని విమర్శించారు. వడ్డెరలంతా జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యలపై కడుపుమంటతో ఉన్నారని లోకేశ్ పేర్కొన్నారు. 

తుంపి రోడ్డులో వన్యకుల క్షత్రియులతో లోకేశ్ సమావేశమయ్యారు. వన్యకుల క్షత్రియులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. బీసీ ఉపకులాల వారీగా ఉన్న సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

ఇక మొరసనపల్లి గ్రామానికి చెందిన తేజ అనే యువకుడు లోకేశ్ ను కలిసి తీవ్ర భావోద్వేగాలకు గురయ్యాడు. తేజ నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. అయితే, అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు పెద్దమనసుతో స్పందించి రూ.16 లక్షలు మంజూరు చేయగా, చికిత్స పొందిన తేజ మునుపటిలో నడవగలుగుతున్నాడు. ఇవాళ లోకేశ్ ను కలిసిన సందర్భంగా తేజ కన్నీటిపర్యంతమయ్యాడు. చంద్రబాబు సాయం వల్లే ఇవాళ తాను మళ్లీ నడవగలుగుతున్నానని చెప్పాడు. అందుకు గాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని వెల్లడించాడు.

More Telugu News