నిజమే.. మా ఇద్దరి మధ్య సరిగ్గా మాటల్లేవు: తలపతి విజయ్ తో మనస్పర్ధలపై తండ్రి చంద్రశేఖర్

  • తమ మధ్య వచ్చే గొడవలు అంత పెద్దవి కావన్న చంద్రశేఖర్
  • ఇటీవల వారిసు మూవీని ఇద్దరం కలిసే చూశామని వెల్లడి
  • తండ్రీ కొడుకులన్నాక గొడవపడ్డం, కలుసుకోవడం మామూలేనని వ్యాఖ్య
vijay thalapathy father chandrasekhar opens about clashes with his son

ఇటీవల వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ్ స్టార్ విజయ్ కి, ఆయన తండ్రికి మధ్య వివాదాల గురించి తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. గతంలో తన తండ్రిపైనే విజయ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. తన కొడుకుతో మనస్పర్ధలపై విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ తాజాగా స్పందించారు. తన కుమారుడితో గొడవలు ఉన్నాయని.. ఇద్దరి మధ్య ఏడాదిన్నరగా సరిగ్గా మాటల్లేవనే విషయం నిజమేనని వెల్లడించారు. ఇదే సమయంలో తమ మధ్య వచ్చే గొడవలు అంత పెద్దవి కావని.. తాము తిరిగి కలుసుకోవడం సహజమని తెలిపారు. 

ఓ తమిళ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ పలు విషయాలు వెల్లడించారు. ‘‘ప్రతి తండ్రి, కొడుకు మధ్య ఉన్నట్లే మా మధ్య కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొంతకాలంగా మా ఇద్దరి మధ్య సరిగ్గా మాటలు లేవు. అయినప్పటికీ నా కొడుకు విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతనికీ నాపైన ప్రేమ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇటీవల విజయ్ నటించిన వారిసు మూవీని ఇద్దరం కలిసే చూశాం. తండ్రీ కొడుకులు అన్న తర్వాత గొడవపడటం.. మళ్లీ కలుసుకోవడం మామూలే కదా. మా మధ్య విభేదాలు.. పెద్దగా చర్చించాల్సిన విషయం కాదు’’ అని ఆయన స్పష్టత నిచ్చారు.

రాజకీయ పార్టీ విషయంలో గతంలో విజయ్, చంద్రశేఖర్ మధ్య వాగ్వాదాలు జరిగాయని ప్రచారం జరిగింది. ఆలిండియా విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను రాజకీయ పార్టీగా మార్చడానికి ప్రయత్నించినందుకు విజయ్ తన తండ్రితోపాటు మరికొంత మందిపై ఫిర్యాదు చేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని ఫిర్యాదు తర్వాత చెప్పారు. తన పేరును వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని కోరారు.

More Telugu News