Gautam Adani: అదానీ గ్రూప్ రుణాలపై వర్రీ లేదంటున్న ప్రభుత్వరంగ బ్యాంకులు

  • అదానీ గ్రూపు రుణాలపై ఆందోళనలు లేవన్న ఎస్ బీఐ చైర్మన్ ఖరా
  • వివరణ కోరినట్టు ప్రకటన ..ప్రైవేట బ్యాంకులదీ ఇదే ధోరణి
  • ఆర్ బీఐ నిబంధనలకు లోబడే రుణాలు ఇచ్చినట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడి
LIC SBI savings at risk amid Hindenburg vs Adani Heres what banks said

అదానీ గ్రూపు షేర్లలో, ఖాతాల్లో అవకతవకలు అంటూ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ ఓ నివేదికను విడుదల చేయడంతో.. స్టాక్ మార్కెట్లలో గ్రూప్ కంపెనీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, హిండెన్ బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలకు వివరంగా బదులిస్తూ ఓ డాక్యుమెంట్ ను స్టాక్ ఎక్సేంజ్ లకు సమర్పించింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్ పీవోని దెబ్బతీయడానికి చేసిన కుట్రగా అభివర్ణించింది. న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి యోచిస్తున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ నకు రుణాలిచ్చిన బ్యాంకు షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటాలు కలిగిన ఎల్ఐసీ షేరుపైనా ఈ ప్రభావం పడింది. 

ఆర్ బీఐ నిబంధనలకు లోబడే తాము అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చినట్టు బ్యాంకులు ప్రకటించాయి. ఆర్ బీఐ నిబంధనల కింద ఒక బ్యాంకు తన నిధుల్లో ఏదైనా ఒక కార్పొరేట్ గ్రూప్ నకు 25 శాతం మించి ఇవ్వకూడదు. దేశంలోనే దిగ్గజ బ్యాంక్, ప్రభుత్వరంగ ఎస్ బీఐ చైర్మన్ దినేష్ ఖరా స్పందిస్తూ.. ‘‘అదానీ గ్రూప్ కంపెనీలకు మేము ఇచ్చిన రుణాలపై ఎలాంటి ప్రమాద ఘంటికలు లేవు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆందోళనలు లేవు’’ అని స్పష్టం చేశారు. ఇటీవల అదానీ గ్రూప్ ఎస్ బీఐ నుంచి ఎలాంటి రుణాలు తీసుకోలేదన్నారు. భవిష్యత్తులో అదానీ గ్రూప్ నుంచి రుణ అభ్యర్థనలు వస్తే కనుక తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. 

అదానీ గ్రూప్ నుంచి తాజా ఆరోపణలపై వివరణ కోరినట్టు ఖరా తెలిపారు. ఈ స్పందన వచ్చిన తర్వాతే సంబంధిత గ్రూప్ నకు తాము ఇచ్చిన రుణాలపై బోర్డులో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం స్పందిస్తూ.. ఆర్ బీఐ అనుమతించిన దానికంటే, తక్కువే రుణ మొత్తాన్ని తాము అదానీ గ్రూప్ నకు ఇచ్చినట్టు స్పష్టం చేసింది. గత నెల వరకు అదానీ గ్రూపు రుణాలపై చెల్లింపులు కొనసాగుతూనే ఉన్నట్టు తెలిపింది. తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని, కాకపోతే పరిశీలనలో ఉంచినట్టు రెండు ప్రైవేటు బ్యాంకుల ప్రతినిధులు ప్రకటించారు.

More Telugu News