తొలి టీ20లో టీమిండియా ఓటమి
- రాంచీ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం
- తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసిన భారత్
టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలో 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం లక్ష్యఛేదనపై బాగా ప్రభావం చూపింది. గిల్ 7, ఇషాన్ కిషన్ 4 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠి డకౌట్ అయ్యాడు.
ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ 47, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులతో జట్టును ఆదుకున్నారు. అయితే వారిద్దరూ అవుట్ కాగా, ఇన్నింగ్స్ నడిపించే భారం వాషింగ్టన్ సుందర్ పై పడింది. అతడికి మరో ఎండ్ నుంచి సహకారం అందించేవాళ్లు కరవయ్యారు. దాంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.
కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ 2, కెప్టెన్ శాంట్నర్ 2, ఫెర్గుసన్ 2, డఫీ 1, సోధీ 1 వికెట్ తీశారు. అంతకుముందు, న్యూజిలాండ్ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది.
కాగా, ఈ విజయంతో న్యూజిలాండ్ మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో మ్యాచ్ జనవరి 29న లక్నోలో జరగనుంది.