Nara Lokesh: నాకు చీర, గాజులు పంపుతానని ఓ మహిళా మంత్రి అన్నారు: లోకేశ్

  • కుప్పంలో లోకేశ్ యువగళం ప్రారంభం
  • పాదయాత్ర సందర్భంగా కుప్పంలో భారీ బహిరంగ సభ
  • మంత్రి పదవిలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలన్న లోకేశ్
  • ఒక్క చాన్స్ ఇస్తే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడన్న లోకేశ్
Lokesh slams a woman minister

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో ఏర్పాటు చేసిన యువగళం సభలో ప్రసంగించారు. తనకు చీరలు, గాజులు పంపుతానని ఓ మహిళా మంత్రి అన్నారని వెల్లడించారు. చీరలు కట్టుకుని గాజులు వేసుకునేవాళ్లు చేతకాని వాళ్లా? అని ప్రశ్నించారు. ఆ మంత్రి ఓ మహిళ అయ్యుండి కూడా మహిళలను తక్కువచేసి మాట్లాడారని విమర్శించారు. 

ఆ చీర, గాజులు పంపించండి... వాటిని మా అక్కచెల్లెళ్లకు ఇచ్చి, వాళ్లకు కాళ్లకు మొక్కి గౌరవిస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. మీ నాయకుడిలాగా తల్లీ, చెల్లిని మెడబట్టి బయటకు గెంటను అంటూ విమర్శించారు. మంత్రి పదవిలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని హితవు పలికారు. 

ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశాడని లోకేశ్ మండిపడ్డారు. యువత, రైతులు... ఇలా అన్ని వర్గాల వారు ఈ ప్రభుత్వ బాధితులేనని అన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. మూడు రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుకైనా వేశారా? అని నిలదీశారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, ఉద్యమిస్తే జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి కాదు జాదూరెడ్డి... ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మహిళల డబ్బు లాక్కున్నాడు అని వ్యాఖ్యానించారు. 

"ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు. ఢిల్లీ పెద్దల మెడలు వంచుతానన్న జాదూరెడ్డి తన మెడనే వంచుకున్నారు. గన్ కంటే ముందే జగన్ వస్తారని మహిళలకు చెప్పారు. కానీ అది బుల్లెట్ లేని గన్ అని ప్రజలకు బాగా అర్థమైంది. దిశ చట్టం తెచ్చామని చెబుతున్నారు... మరి ఎంతమందిని శిక్షించారో చెబుతారా?" అని ప్రశ్నించారు. 

మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు... జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్ లో జాబ్స్ ఉండవు అని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడ్డారని, కనీసం ఒక కానిస్టేబుల్ ఉద్యోగమైనా ఇచ్చారా, మెగా డీఎస్సీ అన్నారు... ఏమైంది? అని నిలదీశారు. ఈ మూడేళ్లలో జే ట్యాక్స్ ఫుల్లుగా వేశారని, జాబులు మాత్రం సున్నా అని అన్నారు. 

బైబై ఏపీ అంటూ పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని, క్యాసినోలు పెడితే పరిశ్రమలు రావని వైసీపీ నేతలు గుర్తించాలని లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ధరలు పెంచేసి బాదుడే బాదుడు అమలు చేస్తున్నారని వెల్లడించారు."అవ్వా.... తాతా... అక్కా... చెల్లీ... అంటూ రూ.10 ఇస్తాడు. కానీ కరెంటు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, చింతపండు, ఉప్పు, నూనె ధరలు బాదుడేబాదుడు... మరి వీటి గురించి మాత్రం మాట్లాడరు. కానీ అమ్మఒడి ఇస్తే మాత్రం దానిపై తన ఫొటో పెట్టుకుంటాడు.... కరెంటు బిల్లుపై, ఇంటిపన్నుపై, చెత్త పన్నుపై మాత్రం ఫొటో ఉండదు. అందుకే జగన్ మోహన్ రెడ్డి పేరు జాదూ రెడ్డి. 

అన్నీ పెంచుతూ పోతానని ఎన్నికల ముందు చెప్పాడు. ప్రజలు ఎంతో ఆశించారు. కానీ పన్నులు, కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు పెంచడం తప్ప జగన్ పీకింది ఏమీలేదు. ఇంకో సంవత్సరం నాలుగు నెలల్లో మన చంద్రన్న వస్తాడు... మన దేవుడు వస్తాడు... ఈ పన్నులన్నీ ప్రక్షాళన చేసి, ఈ నిత్యావసర వస్తువుల ధరలన్నీ తగ్గిస్తాడు" అని లోకేశ్ వివరించారు.

More Telugu News