Nara Lokesh: చంద్రబాబు రాముడు... నేను మాత్రం వైసీపీ వాళ్ల పాలిట రాక్షసుడ్ని: లోకేశ్

  • యువగళం పాదయాత్రకు లోకేశ్ శ్రీకారం
  • కుప్పంలో భారీ బహిరంగ సభ
  • వైసీపీ వాళ్లు చేసిన దానికి చక్రవడ్డీతో చెల్లిస్తానని లోకేశ్ హెచ్చరిక
  • మింగిన ప్రతి రూపాయిని కక్కిస్తానని వ్యాఖ్యలు
  • చంద్రబాబు వచ్చిన తర్వాతే కుప్పం గురించి అందరికీ తెలిసిందని వెల్లడి
Lokesh warns YCP leaders in Kuppam rally

యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వాడీవేడి ప్రసంగం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దేవుడు అని, రాముడి లాంటి వాడు అని, తాను మాత్రం వైసీపీ వాళ్ల పాలిట రాక్షసుడ్ని అవుతానని సభాముఖంగా హెచ్చరించారు. మీరు చేసిందానికి వడ్డీతో సహా, చక్రవడ్డీతో సహా చెల్లిస్తానని స్పష్టం చేశారు. 

మా కుప్పంలో అక్రమ మైనింగ్ చేస్తారా... అక్రమ మైనింగ్ తో మింగిన ప్రతి రూపాయిని కక్కిస్తా... ఆ రూపాయిను కుప్పంలో పేద ప్రజలకు ఖర్చుచేస్తా అని లోకేశ్ వివరించారు. చంద్రబాబు వచ్చిన తర్వాతే కుప్పం గురించి అందరికీ తెలిసిందని అన్నారు. చంద్రబాబు ఏడోసారి గెలిచారు గనుకనే ఇవాళ ఈ కుర్రకుంకలకు నోరు లేస్తోందని అన్నారు. 

"చంద్రబాబు కుప్పంలో మెడికల్ కాలేజీ తీసుకువచ్చారు. ఇంజినీరింగ్ కాలేజీలు తీసుకువచ్చారు. డిగ్రీ కాలేజీ తీసుకువచ్చారు. ద్రవిడ వర్సిటీ తీసుకువచ్చారు. పాఠశాలలు తీసుకువచ్చారు. ఏ రోడ్డయినా తీసుకోండి... దానిపై చంద్రబాబు పేరుంటుంది. నియోజకవర్గంలో చెక్ డ్యాములు కట్టారు. పరిశ్రమలు తీసుకువచ్చి 20 వేల మందికి ఉపాధి కల్పించారు. పేద ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.2లకే ఎన్టీఆర్ సుజల పథకం తీసుకువచ్చారు. 

అయ్యా జగన్ రెడ్డీ... నువ్వు అమూల్ పాలు తాగే సమయంలోనే చంద్రబాబు ఇజ్రాయెల్ టెక్నాలజీతో కుప్పంలో డ్రిప్ ఇరిగేషన్ తీసుకువచ్చారు. రూ.613 కోట్లతో హంద్రీనీవా పనులు 90 శాతం పూర్తి చేస్తే.. ఈ మూడున్నరేళ్లలో మిగిలిన 10 శాతం పూర్తిచేయలేకపోయారు. పేదలకు రూ.100 కోట్లతో హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఈ సైకో ఆపేశాడు. మోడల్ కాలనీ, రింగురోడ్డు పనులు ప్రారంభిస్తే ఈ సైకో ముఖ్యమంత్రి అయ్యాక ఆపేశాడు. ఈ సైకో ముఖ్యమంత్రి అయ్యాక కుప్పానికి ఆర్టీసీ బస్సులు తగ్గించాడు. మీరా కుప్పంలో గెలిచేది? కుప్పంపై మీకు చిత్తశుద్ధి ఉంటే రూ.1300 కోట్ల పనులు పూర్తిచేయండి... అప్పుడు వచ్చి కుప్పంలో ఓట్లు అడగండి" అని స్పష్టం చేశారు.

More Telugu News