తారకరత్న కోలుకుంటున్నాడు.. బెంగళూరుకు తరలిస్తున్నాం: బాలకృష్ణ

  • ఉదయం గుండెపోటుకు గురైన తారకరత్న
  • మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తున్నామన్న బాలకృష్ణ
  • రోడ్డు మార్గంలో అంబులెన్సులో తరలించనున్నట్టు వెల్లడి
Lifting Tarak Ratna to Bengaluru says Balakrishna

యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించారు. తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు తదితరులు అక్కడే ఉన్నారు. మరోవైపు తారకరత్న ప్రస్తుత పరిస్థితి గురించి బాలకృష్ణ మాట్లాడుతూ... తారకరత్న కోలుకుంటున్నారని చెప్పారు. బీపీ కంట్రోల్ లో ఉందని తెలిపారు. అన్ని పారామీటర్స్ బాగున్నాయని చెప్పారు. అన్ని రిపోర్టులు సక్రమంగా ఉన్నాయని అన్నారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయినట్టు డాక్టర్లు చెప్పారని అన్నారు. 

కుప్పంలోని డాక్టర్లు  మంచి చికిత్స చేశారని... ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకుగాని, మరెక్కడికైనా తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారని... తాము బెంగళూరుకు తరలిస్తున్నామని బాలయ్య చెప్పారు. ఎయిర్ లిఫ్ట్ చేద్దామని అనుకున్నప్పటికీ, వాటిలో సరైన వైద్య పరికరాలు ఉండవని... అందువల్ల రోడ్డు మార్గంలో అంబులెన్సులో తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ఆయన తాత ఎన్టీఆర్ గారు, నానమ్మగారి ఆశీర్వాదాలు, భార్య మాంగల్య బలం, అభిమానుల ప్రార్థనల వల్ల ప్రాణాపాయం లేదని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబుగారు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారని చెప్పారు.

More Telugu News