నేడు ఢిల్లీ యూనివర్సిటీలో 'మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ'ని ప్రదర్శిస్తామంటున్న విద్యార్థి సంఘాలు

  • సాయంత్రం 5 గంటలకు స్క్రీనింగ్ ఉంటుందన్న భీమ్ ఆర్మీ
  • అనుమతి లేదని, అడ్డుకుంటామని చెప్పిన వర్సిటీ యంత్రాంగం
  • బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనపై పలు వర్సిటీల్లో ఇప్పటికే గొడవలు
delhi university student unions to screen bbc documentary

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై వివాదం సద్దుమణగడం లేదు. దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ జరుగుతోంది. కేరళలోని కొన్ని క్యాంపస్‌లలో ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీని విద్యార్థి సంఘాలు ప్రదర్శించాయి. ఈ విషయంలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ఇతర యూనివర్సిటీల క్యాంపస్‌లలో కూడా ఈ వీడియోను ప్రదర్శిస్తామని ఇప్పటికే స్టూడెంట్ యూనియన్లు ప్రకటించాయి. 

ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ కు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ యూఐ), భీమ్ ఆర్మీ, ఇతర విద్యార్థి సంఘాలు ఏర్పాట్లు చేశాయి. ఆర్ట్స్ ఫ్యాకల్టీ గేట్ నంబర్ 4 దగ్గర సాయంత్రం 5 గంటలకు ప్రదర్శిస్తామని భీమ్ ఆర్మీ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. అయితే స్క్రీనింగ్, నిరసనలకు అనుమతి లేదని, వాటిని ఆపడానికి తాము ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ యంత్రాంగం తెలిపింది.

మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్ లను బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్ తదితర ప్లాట్ ఫామ్ లను ఆదేశించింది. అయితే ప్రభుత్వ చర్యలను ప్రతిపక్షాలు ఖండించగా.. వాటి అనుబంధ యూత్ వింగ్స్, విద్యార్థి సంఘాలు మాత్రం కాలేజీలు, క్యాంపస్ లలో డాక్యుమెంటరీ స్క్రీనింగ్స్ కు పిలుపునిచ్చాయి. జేఎన్ యూలో ప్రదర్శనకు ప్రయత్నించగా.. పరిస్థితి రాళ్లు రువ్వుకునే దాకా వెళ్లింది. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో 13 మంది స్టూడెంట్లను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత విడుదల చేశారు.

More Telugu News