stock markets: స్టాక్ మార్కెట్లో ఆగని అమ్మకాలు.. అదానీ గ్రూపు స్టాక్స్ విలవిల

  • అదానీ గ్రూప్ లో అవకతవకలంటూ అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలు
  • ఖండించిన అదానీ గ్రూప్
  • ప్రతికూలంగా మారిన సెంటిమెంట్
  • బడ్జెట్ ముందు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
Adani Group companies face bloodbath on Dalal Street

అదానీ గ్రూపు షేర్లు శుక్రవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కు వచ్చిన అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ఇంట్రాడేలో సుమారు 10 శాతం నష్టాలను ఎదుర్కొంది. 3050.90 కనిష్ఠ ధరను బీఎస్ఈ లో నమోదు చేసింది. ప్రస్తుతం రూ.3,100 వద్ద ట్రేడవుతోంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ లో ఒక్కో షేరును రూ.3,112-3,276 ధరలో ఆఫర్ చేస్తుండగా, మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకే షేర్ లభిస్తోంది.


అటు అదానీ ట్రాన్స్ మిషన్ 17 శాతం నష్టపోగా, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ సైతం సుమారు 10 శాతం వరకు ఇంట్రాడేలో నష్టపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 15 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 20 శాతం, అదానీ విల్ మార్, అదానీ పవర్ 5 శాతం చొప్పున నష్టాలను ఎదుర్కొన్నాయి. ఏసీసీ, అంబుజా సిమెంట్ షేర్లు సైతం 9-10 శాతం వరకు నష్టపోయాయి. అదానీ గ్రూప్ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలను ఖండించడంతోపాటు, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

అదానీ గ్రూప్ పై ప్రతికూల సెంటిమెంట్ కు తోడు, బడ్జెట్ కు ముందు మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తున్నారు. బుధవారం ఫారీన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు సమారు రూ.2,200 కోట్ల మేర అమ్మకాలు చేశారు. ప్రస్తుతం నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 17,611 వద్ద, సెన్సెక్స్ 926 పాయింట్ల నష్టంతో 59278 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పెద్దగా ప్రతికూలతలు లేవు. అమెరికా మార్కెట్లు నిన్న స్వల్ప లాభాలతో ముగియగా, ఆసియా మార్కెట్లు సైతం లాభాలతోనే మొదలయ్యాయి. రూపాయి కేవలం 9 పైసలు నష్టపోయి డాలర్ తో 81.52 వద్ద ట్రేడవుతోంది. చమురు ధరల్లోనూ పెద్దగా మార్పు లేదు. 

సెన్సెక్స్ లో హెచ్ డీఎఫ్ సీ జంట షేర్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 2 శాతం వరకు నష్టపోతే, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బీఐ, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్ సైతం నష్టాలను ఎదుర్కొన్నాయి. టాటా మోటార్స్, ఐటీసీ, ఎంఅండ్ఎం, మారుతి, టాటా స్టీల్, సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి.

More Telugu News