తెలుగు తెర 'సత్యభామ' .. జమున

  • తెలుగు సినిమాపై ప్రత్యేకమైన ముద్ర జమున
  • సావిత్రి తరువాత స్థానంలో చెప్పుకునే నటి ఆమెనే 
  • అప్పట్లోనే ఆంధ్ర డ్రీమ్ గాళ్ అనిపించుకున్న హీరోయిన్
  • ఎన్టీఆర్ - ఏఎన్నార్ లతో ఎక్కువ సినిమాలు 
  • దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన హంపీ శిల్పం
Jamuna Special

జమున .. చందమామ వంటి చక్కదనంతో .. తెలుగు తెరపై వెన్నెల కురిపించిన అలనాటి సౌందర్య శిల్పం. హంపీలో పుట్టడం వలన ఆమెను అంతా హంపీ శిల్పమని అనేవారు. టాలీవుడ్ కి సంబంధించి హీరోల్లో ఎన్టీఆర్ తరువాత ఏఎన్నార్ ను చెప్పుకున్నట్టే, హీరోయిన్స్ లో సావిత్రి తరువాత జమున పేరు చెప్పుకుంటారు. సావిత్రి అనగానే నిండుదనం గుర్తొస్తే .. జమున పేరు వినగానే నాజూకుదనం గుర్తొస్తుంది. విశాలమైన కళ్లతో ఆమె చేసే విన్యాసం గుర్తొస్తుంది.

తొలితరం కథానాయికలలో చాలా చిన్నవయసులోనే వెండితెరకి పరిచయమైనవారిలో జమున ఒకరిగా కనిపిస్తారు. అయినా తన కెరియర్ ను .. జీవితాన్ని చాలా పద్ధతిగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. 1953లో 'పుట్టిల్లు' సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం దశాబ్దాల పాటు కొనసాగింది. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ ... చలం .. హరనాథ్ వంటి హీరోలతో సినిమాలు చేస్తూ వెళ్లారు. అప్పట్లో మోడ్రన్ డ్రెస్ లలో .. మోడ్రన్ స్టెప్పులు వేయడం జమునతోనే మొదలైందని చెప్పాలి.  ఆ సమయంలోనే ఆమె 'ఆంధ్ర డ్రీమ్ గాళ్' అనిపించుకున్నారు కూడా.  

సాంఘిక చిత్రాలలోనే కాదు .. చారిత్రక .. పౌరాణిక .. జానపద .. చిత్రాలకు తగిన కనుముక్కుతీరు ఉండటం వలన, అప్పట్లో జమునను మించిన ఆప్షన్ లేదు.  అమాయకత్వం నిండిన పాత్రలలోనే కాదు .. అహంభావం నిండిన పాత్రలను సైతం ఆమె అద్భుతంగా పోషించేవారు. 'పండంటి కాపురం'లోని 'రాణి మాలిని దేవి' పాత్ర అందుకు నిలువెత్తు నిదర్శనం. 

అప్పట్లో అటు ఎన్టీఆర్ .. ఇటు ఏఎన్నార్ .. సావిత్రి కాంబినేషన్లో నటించి మెప్పించిన ఘనత జమున సొంతం. 'మిస్సమ్మ' .. 'గుండమ్మ కథ' సినిమాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి. ఇక పౌరాణికాలలో ఆమె చాలా పాత్రలు చేసినప్పటికీ, 'శ్రీకృష్ణ తులాభారం'లో 'సత్యభామ'గా ఆమె తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తరువాత ఎవరూ కూడా ఆమె బాడీ లాంగ్వేజ్ ను మ్యాచ్ చేయలేకపోయారు. అందువలన ఇప్పటికీ తెలుగుతెర సత్యభామ ఎవరంటే .. జమున పేరు మాత్రమే వినిపిస్తుంది. 

ఒకానొక సమయంలో అగ్రస్థాయి హీరోలు ఆమె తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేసి, ఆమెను పక్కన పెడితే.. హరనాథ్ .. జగ్గయ్య వంటి వారితోనే కెరియర్ ను నెట్టుకొచ్చిన ఘనత ఆమె సొంతం. ఒక హీరో తాగేసి సెట్ కి వస్తే .. సెట్ లో నుంచి వెళ్లిపోయిన ఆత్మ గౌరవం ఆమెలో కనిపించే ప్రత్యేకత. అందాల తారగా అద్దాల మేడల్లో తిరిగే పాత్రలు మాత్రమే చేయగలదనే విమర్శలకు, 'మూగమనసులు' సినిమాలోని 'గౌరి' పాత్రతో సమాధానం చెప్పిన నైజం ఆమెది. 

ఇలా ఒకటేమిటి ఎన్నో విభిన్నమైన ... విలక్షణమైన పాత్రలకు జమున కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ల గురించి చెప్పుకునేటప్పుడు జమున పేరు రాకుండా .. లేకుండా చేయడమనేది అసాధ్యమైన విషయం. కొన్ని కారణాల వలన అప్పట్లో ఆమెను తీసుకోకుండా 'గుండమ్మ కథ' చేద్దామనుకున్నారు. కానీ అసాధ్యమని భావించడం వల్లనే దిగొచ్చారు .. అది జమున గొప్పతనం. అలాంటి జమున ఈ లోకాన్ని వీడి వెళ్లినా, 'పగలే వెన్నెలా .. జగమే ఊయలా' అంటూ అభిమానుల కళ్లముందు ఎప్పటికీ కదలాడుతూనే ఉంటుంది.

More Telugu News