ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరో శాస్త్రవేత్తలు తేల్చేశారు!

  • బ్రిటిష్ నటుడు రెగె జీన్‌ పేజ్‌ను అత్యంత అందమైన వ్యక్తిగా ప్రకటించిన శాస్త్రవేత్తలు
  • ఫేస్ మ్యాపింగ్ పద్ధతి గ్రీన్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటి ఫైని ఉపయోగించి నిర్ధారణ
  • 93.65 శాతం కచ్చితత్వంతో జీన్ ముఖం
British Actor Rege Jean Page Is The Most Handsome Man In The World

బ్రిటిష్ నటుడు రెగె జీన్ పేజ్‌ను ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సంప్రదాయ ఫేస్ మ్యాపింగ్ పద్ధతి గ్రీన్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫైని ఉపయోగించి ఈ విషయాన్ని తేల్చారు. ఈ విధానంతో ఓ వ్యక్తి ముఖం ఎంత పరిపూర్ణంగా ఉందో లెక్కకట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

బ్రిటన్‌కు చెందిన కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డి సిల్వా కంప్యూటరైజ్డ్ బ్యూటీ ఫై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా రెగె జీన్‌ను ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగా నిర్ధారించారు. బ్యూటి ఫై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా జీన్ పేజ్ కళ్లు, ముక్కు, కనుబొమలు, పెదాలు, దవడ, ముఖం అమరికను అంచనా వేశారు. అతడి ముఖం 93.65 శాతం కచ్చితత్వంతో ఉన్నట్టు గుర్తించారు. 

జీన్ తర్వాతి స్థానంలో థోర్  సినిమా నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ 93.53 శాతంతో రెండో స్థానంలో ఉండగా, బ్లాక్ పాంథర్ నటుడు మిఖాయెల్ బి జోర్డాన్ 93.46 శాతం, సింగర్ హ్యారీ స్టైల్ 92.30 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఈ సందర్భంగా డాక్టర్ జూలియన్ డి సిల్వా మాట్లాడుతూ.. బ్యూటి ఫై మ్యాపింగ్ టెక్నిక్ ఓ వ్యక్తి శారీరకంగా అందంగా ఉన్నాడని చెప్పేందుకు అవసరమైన అంశాలను విశ్లేషించి కచ్చితమైన ఫలితాలను వెల్లడిస్తాయన్నారు. ఆపరేషన్లు చేసేటప్పుడు కూడా ఇవి తమకు ఉపయోగపడతాయని చెప్పారు. ఇవే ప్రమాణాలను ఉపయోగించి జీన్‌ను అందమైన వ్యక్తిగా గుర్తించినట్టు చెప్పారు. అతడి కళ్లు, పెదాలు కచ్చితమైన స్థానాల్లో ఉండడంతో అతడి ముఖం అత్యంత అందమైనదిగా పరీక్షల్లో నిర్ధారణ అయిందని వివరించారు.

More Telugu News