న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ముంగిట రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

  • రేపటి నుంచి టీమిండియా, న్యూజిలాండ్ టీ20 సిరీస్
  • తొలి మ్యాచ్ కు రాంచీ ఆతిథ్యం
  • మణికట్టు గాయంతో బాధపడుతున్న గైక్వాడ్
Ruturaj Gaikwad injured ahead of T20 series with New Zeland

ఇటీవల కాలంలో టీమిండియా ఆటగాళ్లు తరచుగా గాయపడుతున్నారు. తాజాగా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (25) మణికట్టు గాయానికి గురయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ న్యూజిలాండ్ తో 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇప్పుడు సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గైక్వాడ్ గాయపడ్డాడు. టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ రేపు రాంచీలో జరగనుంది. ఈ మ్యాచ్ లో గైక్వాడ్ ఆడేది అనుమానమే. 

మహారాష్ట్ర, హైదరాబాద్ రంజీ మ్యాచ్ సందర్భంగా మణికట్టు నొప్పితో బాధపడిన గైక్వాడ్, గాయం సంగతి బీసీసీఐకి సమాచారం అందించాడు. ప్రస్తుతం గైక్వాడ్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అతడి గాయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. 

గైక్వాడ్ కు గాయాలు కొత్త కాదు. గతేడాది కూడా శ్రీలంకతో టీ20 మ్యాచ్ సందర్భంగా ఇలాగే మణికట్టు గాయంతో జట్టుకు దూరమయ్యాడు.


న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు టీమిండియా ఇదే...
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (?), శుభ్ మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేశ్ కుమార్, యజువేంద్ర చహల్, అర్షదీప్ సింగ్.


More Telugu News